Share News

Kamareddy : ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:09 AM

రాష్ట్రంలో మంగళవారం మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామ పరిధిలో ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది.

Kamareddy : ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

  • బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఒకరి మృతి

  • మరో 2 వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

ధర్మారం, కామారెడ్డి, పటాన్‌చెరు, జూన్‌ 25: రాష్ట్రంలో మంగళవారం మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామ పరిధిలో ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో ప్రయాణిస్తున్నవారిలో అఫ్జల్‌ ఖాన్‌ (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 28 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో బస్సు డ్రైవర్‌ షేక్‌ రషీద్‌కు కుడి కాలు విరగ్గా.. ముబీన్‌ అనే ప్రయాణికుడికి తల పగిలింది. వీరి పరిస్థితి విషమంగా ఉంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌ వద్ద మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, మినీ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మినీ ట్రక్కులోని డ్రైవర్‌ అన్వర్‌ (25), అబ్జల్‌(55) అనే మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కు నుజ్జునుజ్జుకావడం.. లోపల మృతదేహాలు ఇరుక్కుపోవడంతో గ్యాస్‌ కట్టర్‌ ద్వారా కట్‌ చేసి బయటకు తీయాల్సి వచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ముత్తంగి జంక్షన్‌ వద్ద ఆగివున్న లారీని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాను క్యాబిన్‌లో డ్రైవర్‌ పక్కన కూర్చున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులిద్దరూ బిహార్‌ వలస కూలీలు.

Updated Date - Jun 26 , 2024 | 05:10 AM