ఫార్ములా-ఈ కేసు.. అప్రూవర్‌గా అర్వింద్‌కుమార్?
ABN , Publish Date - Dec 25 , 2024 | 03:38 AM
ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది.
రాజీ ప్రయత్నాలు ప్రారంభం!!
అధికారవర్గాల్లో జోరుగా చర్చ
తొలుత అర్వింద్‌ను విచారించే చాన్స్
ఇప్పటికే ఏసీబీ చేతికి ఒప్పంద పత్రాలు
ఫ్రేమ్‌వర్క్ కాగానే కేటీఆర్‌కు నోటీసులు!
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారవర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తనకు కావాల్సిన వారి ద్వారా ఆయన ప్రభుత్వంలోని పెద్దలతో రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
అర్వింద్‌కుమార్ పాత్ర ఏమిటి?
ఈ కేసులో అర్వింద్‌కుమార్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. క్యాబినెట్ అనుమతి లేకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధులను బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు.. విదేశీ కంపెనీలకు నిధులను బదిలీ చేయాలంటే.. రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఫారెక్స్ చెల్లింపుల(బ్రిటన్ పౌండ్లలో)కు ఆర్‌బీఐ అనుమతి కూడా అవసరం. అయితే.. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి హోదాలో అర్వింద్‌కుమార్ తొలుత నిధులను బదిలీ చేసి.. ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో ఏసీబీ తొలుత అర్వింద్‌కుమార్‌ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పాత్రపై బలమైన ఆధారాలను సేకరించిన ఏసీబీ.. ఇప్పటికే ముఖ్యమంత్రికి ఓ నివేదికను అందజేసింది. ఆ తర్వాతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయనకు నోటీసు జారీ చేసి, వివరణ తీసుకున్నారు. ఆ క్రమంలో ఆయన ‘‘అప్పటి మంత్రి కేటీఆర్ చెబితనే రూ.55 కోట్లను బదిలీ చేశా’’ అని వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. న్యాయ నిపుణులు కూడా ఏ2గా ఉన్న అర్వింద్ అరెస్టు తప్పదని వివరిస్తున్నారు.
హైకమాండ్ స్థాయిలో..
ఏసీబీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అర్వింద్‌కుమార్ తెరవెనక ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి.. తనను కాపాడాలని అభ్యర్థించినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అప్రూవర్‌గా మారడం ఒక్కటే మార్గంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిగా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేసిన అర్వింద్‌కుమార్ అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల వ్యవహారంలో అప్పటి పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..! ఈ నేపథ్యంలో అర్వింద్‌కు కాంగ్రెస్ హైకమాండ్ అండదండలుంటాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏమిటీ కేసు..?
ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్‌కు అంతర్జాతీయ బ్రాండింగ్ వస్తుందని గత ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. 2023లో తొలిసారి రేస్ నిర్వహించిన ప్రభుత్వం.. 2024లో మరోసారి నిర్వహణకు విదేశీ సంస్థలతో రూ.100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ముందస్తుగా రూ.55 కోట్లను రేస్ నిర్వహణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించిన మునిసిపల్ శాఖ ద్వారా చెల్లించింది. గత ఏడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలినాళ్లలోనే ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దాంతో.. ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి విదేశీ కంపెనీలతో ఉన్న ఒప్పందాలను రద్దుచేసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మునిసిపల్ శాఖ ఈ వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం.. కేసు నమోదవ్వడం తెలిసిందే..! ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా చేర్చిన ఏసీబీ.. అంతకు ముందే గవర్నర్ అనుమతి తీసుకుంది. కేటీఆర్ కంటే ముందే.. అర్వింద్‌కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తుండడంతో.. ఆత్మరక్షణలో పడ్డ ఆయన.. అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. అర్వింద్‌ను విచారించి, ఆయన ఇచ్చే వాంగ్మూలం మేరకు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసేదిశలో ఏసీబీ వేగంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.