Share News

రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్‌, ఏరోస్పేస్‌ పార్క్‌!

ABN , Publish Date - Jan 04 , 2024 | 03:21 AM

రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు అమలుచేస్తున్న సంస్థ..

రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్‌, ఏరోస్పేస్‌ పార్క్‌!

కొత్త పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి

సీఎం రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్‌ ప్రతినిధుల చర్చలు

శంషాబాద్‌లో ఎనర్జీ పార్క్‌, పరిశోధన కేంద్రం పెడతాం

ముఖ్యమంత్రితో అమరరాజా చైర్మన్‌ గల్లా జయదేవ్‌

కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యధిక ప్రాధాన్యమిస్తాం

ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తాం: సీఎం

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు అమలుచేస్తున్న సంస్థ.. మరిన్ని పెట్టుబడులకు సంబంధించి బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. అదానీ గ్రూప్‌ పోర్ట్స్‌, సెజ్‌ సీఈవో, చైర్మన్‌ గౌతం అదానీ పెద్ద కుమారుడు కరణ్‌ అదానీ, ఏరోస్పేస్‌ సీఈవో ఆశిష్‌ రాజ్‌వన్షీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్‌, ఏరోస్పేస్‌ పార్క్‌ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని వారు సీఎంకు వివరించారు. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులతోపాటు కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్‌ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు.. న్యూ ఎనర్జీ, లిథియం అయాన్‌ బ్యాటరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలతో పాటు వివిధ రంగాలలో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని అమరరాజా కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు.. ఆ సంస్థ చైర్మన్‌ గల్లా జయదేవ్‌ సీఎం రేవంత్‌, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు. న్యూ ఎనర్జీ పార్క్‌, బ్యాటరీ ప్యాక్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌, శంషాబాద్‌లో ఈ-పాజిటివ్‌ ఎనర్జీ ల్యాబ్స్‌ పేరుతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.

అమరరాజా సంస్థ ఇప్పటికే మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లిలో రూ.9500 కోట్ల పెట్టుబడులతో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీకి సంబంధించి గిగా ప్రాజెక్టు నిర్మాణ పనులకు 2023 మేలో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫ్యాక్టరీ పనుల పురోగతి గురించి సీఎం ఈ భేటీలో అడిగి తెలుసుకున్నారు. తమ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడానికి అవసరమైన మద్దతు ఇస్తున్న ప్రభుత్వానికి జయదేవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రోజురోజుకూ విస్తరిస్తున్న ఎలకా్ట్రనిక్‌ వాహనాలు, న్యూ ఎనర్జీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భూమిక పోషిస్తోందని, కొత్త పరిశ్రమల స్థాపనకు తగినంత మద్దతును ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా.. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథంలో అమరరాజా కీలక భాగస్వామి అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణలో ఆ కంపెనీ తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 03:21 AM