Congress: పార్టీ నిర్ణయం శిరోధార్యం.. ఎమ్మెల్సీ టికెట్ నిరాకరణపై అద్దంకి రియాక్షన్
ABN , Publish Date - Jan 17 , 2024 | 05:55 PM
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా తన పేరు ఉంటుందని భావించిన ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌కు(Addanki Dayakar) షాక్‌నిస్తూ అధిష్ఠానం టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్: రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా తన పేరు ఉంటుందని భావించిన ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌కు(Addanki Dayakar) షాక్‌నిస్తూ అధిష్ఠానం టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. అధిష్ఠానం తనపై పాజిటీవ్‌గా ఉందని.. మరింత మంచి స్థానాన్ని కట్టబెడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులను బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఫైనల్ చేసింది. సంబంధిత ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు బిగ్ షాక్ ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం. అద్దంకి మొండి చేయి చూపుతూ.. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను విడుదల చేసింది. గురువారంతో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియనుండగా.. బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. అయితే, నిన్నటి వరకు కూడా అద్దంకి దయాకర్‌కే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు అని ప్రచారం జరుగగా.. ఇవాళ సీన్ రివర్స్ అయ్యింది.
అంతేకాదు.. మంగళవారం నాడు పార్టీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్‌కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారట. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. దయాకర్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఈ సంబరాలు, అనందం గంటల్లో ఆవిరయ్యాయి. కాంగ్రెస్ ప్రకటించిన లిస్ట్‌లో దయాకర్ పేరు మిస్ అయ్యి.. మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అధిష్ఠానం తనకు మరింత మంచి హోదా కట్టబెడుతుందని దయాకర్ భావిస్తున్నారు.
29న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు..
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుండగా.. 29న రెండు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు.