NIMS : నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీలోకి
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:14 AM
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో లభించే అన్ని రకాల వైద్యసేవలు, శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్యసేవల
కార్డు ఉంటే రూ.10 లక్షల దాకా ఉచిత వైద్యం
పేద, మధ్య తరగతి వర్గాల వారికి ప్రయోజనం
ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ, ఎల్‌వోసీ వాడకం..
దుర్వినియోగం మంత్రి దామోదర దృష్టికి..
దీంతో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో లభించే అన్ని రకాల వైద్యసేవలు, శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్యసేవల పరంగా ఎంతో మేలు జరగనుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు.. రూ. 10 లక్షల వరకూ అన్ని రకాల వైద్య సేవలనూ నిమ్స్‌లో ఉచితంగా పొందే వెసులుబాటు కలగనుంది. నిమ్స్ ఆస్పత్రిలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో కొన్ని మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. ఆ పరిధిలో లేని చికిత్స/సర్జరీ చేయించుకోవాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ‘లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ)’ తెచ్చుకోవాల్సి వచ్చేది. అంటే.. చికిత్సకు అయ్యే ఖర్చు ఎంతో పేర్కొంటూ రోగి పేరిట వైద్యులు ఒక లేఖ ఇస్తారు. ఆ లేఖ ఆధారంగా.. తమకు అయ్యే వైద్య ఖర్చులను భరించాలని కోరుతూ రోగులూ సీఎంవో లేదా మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రోగికి తెల్ల రేషన్ కార్డు ఉంటే దాని ప్రకారం.. లేదా, వారి వార్షికాదాయాన్ని పరిగణలోకి తీసుకుని, వైద్యులిచ్చిన శస్త్రచికిత్స వ్యయ అంచనాను బేరీజు వేసి మొత్తం ఖర్చును లేదా కొంచెం తక్కువగా అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, సదరు రోగికి తక్షణమే వైద్య చికిత్సను అందించాలని ఆదేశిస్తూ ఇచ్చే లేఖనే ‘ఎల్‌వోసీ’గా వ్యవహరిస్తారు. నిమ్స్‌లో ప్రస్తుతం కొన్ని చికిత్సలను ఇలా ఎల్వోసీ ఆధారంగా చేస్తున్నారు. తర్వాత ఆ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వం నిమ్స్‌కు జమ చేస్తోంది.
11 వేల సార్లు..
ఎల్‌వోసీ తెచ్చుకునే విషయంలో రోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు వెంటనే వస్తే...మరికొన్నిసార్లు సరైన పత్రాలు లేని కారణంగా బాగా ఆలస్యం అవుతోంది. అంతేకాక కొన్ని ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేయడమే కాకుండా వాటికే ఎల్‌వోసీలు కూడా పెట్టినట్లు ఆరోగ్యశ్రీ ఉన్నతాఽధికారులు గుర్తించారు. నిమ్స్ ఆస్పత్రిలో అలా ఏకంగా 11 వేల సార్లు ఎల్‌వోసీ దుర్వినియోగం అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అసలు నిమ్స్‌లో చేసే చికిత్సలకు ఎల్‌వోసీ ఎందుకున్న భావనకు ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు వచ్చారు. ఇటీవల వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించినప్పుడు ఆయన దృష్టికి ఈ విషయం తీసుకొచ్చి.. నిమ్స్‌లో చేసే అన్ని సర్జరీలు, వైద్య సేవలనూ ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా జీవో విడుదల కావాల్సి ఉంది. తొలుత నిమ్స్‌తో మొదలుపెట్టి.. ఆ తర్వాత అన్ని సర్కారీ దవాఖానాల్లో దీన్ని అమలు చేసే అవకాశం ఉంది.