గత పాలకుల నేరాలన్నీ బయటికివస్తున్నాయి
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:15 AM
గత ప్రభుత్వ పాపాలు, నేరాలు నాలుగు నెలలుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
సూర్యాపేటటౌన్, ఏప్రిల్ 15: గత ప్రభుత్వ పాపాలు, నేరాలు నాలుగు నెలలుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం జరిగిన నీటిసంఘం మాజీ వైస్ చైర్‌పర్సన్, సీపీఐ నాయకురాలు కప్పల లిం గమ్మ సంతాపసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మాజీ సీఎం కేసీఆర్ హ యాంలో పదేళ్లలో చేసిన పాపాలను ప్రక్షాళన చేస్తోందన్నారు. బీజేపీ, కేసీఆర్ చేస్తున్న రైతు దీక్షలను చూసి సమాజం నవ్వుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా ఏం చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రైతు దీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. పదేళ్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభు త్వాలు చేయనివి, 120రోజుల్లో కాంగ్రెస్‌ను చేయాలని ఎలా ప్రశ్నిస్తారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రైతులను పట్టించుకోలేదని, వ్యవసాయాన్ని విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే నాలుగు హామీలు అమలు చేసిందని, ఈ నాలుగు నెలల్లో కొంతైనా మేలు చేసిన ఘనత కాంగ్రె్‌సదేనన్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుంటే బీజేపీ, బీఆర్‌ఎ్‌సకు వేసిన శిక్షనే ప్రజలు కాంగ్రె్‌సకు వేస్తారని తెలిపారు. 120రోజుల కాంగ్రెస్ పాలనకే ఎందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ ఉలిక్కిపడుతున్నాయని ప్రశ్నించారు. ఎవరు అవునన్నా, కాదన్నా కమ్యూనిస్టులు బలపర్చిన కూటమికే రానున్న ఎన్నికల్లో విజయం సాధ్యమని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకే మెజార్టీ సీట్లు వస్తాయని తెలిపారు. గతంలో ఎకరాకు రూ.10వేలు పంట నష్ట పరిహారం ఇస్తానన్న మాజీసీఎం కేసీఆర్ అది ఇవ్వకుండా ఇప్పుడు రూ.25వేలు ఇవ్వాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అకాల వర్షాలు, సాగునీరులేక ఎండిన పంటలకు ఎకరానికి ప్రభుత్వం రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, నాయకులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, నెలికంటి సత్యం, సృజన, మల్లీశ్వరీ పాల్గొన్నారు.