వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
ABN , Publish Date - Jan 13 , 2024 | 12:32 AM
ఆనలైన బెట్టింగ్‌లతో ఆర్థికంగా నష్టపోయి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
మేళ్లచెర్వు, జనవరి 12 : ఆనలైన బెట్టింగ్‌లతో ఆర్థికంగా నష్టపోయి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేళ్లచెర్వులోని సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న వంటెద్దు అశోక్‌రెడ్డి(33) ఆనలైన బెట్టింగ్‌లకు బానిసై అప్పులు చేశాడు. గతంలో తండ్రి మట్టారెడ్డి వ్యవసాయ భూమి విక్రయించి అప్పు తీర్చారు. అయినా మారని అశోక్‌రెడ్డి తిరిగి ఆనలైన గేమ్‌లు ఆడి మరోసారి అప్పుల పాలుకావడంతో భార్య పావని, కుమార్తెతో తన స్వగ్రామం నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామానికి పంపించాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంటున్నట్లు ఫోనలో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు చుట్టపక్కల ఇళ్ల వాళ్లను అప్రమత్తం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. తండ్రి మట్టారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
జీవితంపై విరక్తి చెంది..
శాలిగౌరారం, జనవరి 12 : మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ ఉప్పల సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెర్కకొండారం గ్రామానికి చెందిన మాచర్ల సతీ్‌ష(25)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం నుంచి మద్యానికి బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. తాగవద్దని భార్య మందలించడంతో చనిపోతానని బెదిరించేవాడు. గతంలో కూడా పలుమార్లు పురుగుల మందు తాగి ఇంటికొచ్చేవాడు. ఈ నెల 5వ తేదీన గ్రామ శివారులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం సతీష్ మృతి చెందాడని ఎస్‌ఐ సతీష్ తెలిపారు. తల్లి జానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన మహిళ...
కొత్తపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో అంజిరెడ్డి కథనం ప్రకారం మన్సూరాబాద్ భవానీగనర్‌లో ఉండే శిరీష(30) భర్త గంరెడ్డి జానారెడ్డి స్వగృహ ఫుడ్స్ వ్యాపారం చేస్తున్నారు. జానారెడ్డి క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పెద్దమొత్తంలో పోగొట్టుకున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో శిరీష తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న మృతురాలి తండ్రి సంకలమద్ది సుధాకర్‌రెడ్డి నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం తోపుచెర్ల గ్రామం నుంచి మన్సూరాబాద్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యాడు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌హెచవో అంజిరెడ్డి తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.