నెరవేరని బడ్జెట్ వ్యయ లక్ష్యం
ABN , Publish Date - May 10 , 2024 | 05:26 AM
ఈసారి కూడా నిర్దేశిత బడ్జెట్ లక్ష్యం నెరవేరలేదు. భారీ బడ్జెట్‌లను ప్రవేశపెట్టడం, వాస్తవిక వ్యయాలు మాత్రం తక్కువగా ఉండడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది.
2023-24లో 15.05 శాతం తగ్గుదల.. మొత్తం వ్యయం రూ.2,11,705 కోట్లు
బడ్జెట్‌లో అంచనా రూ.2,49,209 కోట్లు
రెవెన్యూ రాబడులు 78.08 శాతమే
కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద ఎక్కువగా అంచనా వేసిన గత ప్రభుత్వం
కానీ.. వచ్చింది 23.58 శాతం నిధులే!
మార్చి నెల ప్రాథమిక వివరాలను వెల్లడించిన ‘కాగ్’
హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): ఈసారి కూడా నిర్దేశిత బడ్జెట్ లక్ష్యం నెరవేరలేదు. భారీ బడ్జెట్‌లను ప్రవేశపెట్టడం, వాస్తవిక వ్యయాలు మాత్రం తక్కువగా ఉండడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో బడ్జెట్‌లను ప్రవేశపెడుతూ వచ్చినా... వ్యయాలు ఎప్పుడూ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ నుంచి రుణాలు, అడ్వాన్సుల పంపిణీ వంటివి పోనూ... నికరంగా రూ.2,49,209.93 కోట్ల వ్యయం ఉంటుందని అంచనా వేసింది. కానీ... వ్యయం మాత్రం రూ.2,11,705.70 కోట్లుగా నమోదైంది. ఈ మేరకు మార్చి 31తో పూర్తయిన 2023-24 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ రాబడులు, వ్యయాల వివరాలను ‘కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ గురువారం విడుదల చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈసారి వ్యయం 84.95 శాతంగా నమోదైందని తెలిపింది. అంటే.. బడ్జెట్‌లో అంచనా వేసిన మొత్తం వ్యయంలో 15.05 శాతం మేర వ్యయ లోటు ఏర్పడింది. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కోసం రూ.78,952.43 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం రూ.23,337.40 కోట్లు, ఉద్యోగుల వేతనాలు/భత్యాల కోసం రూ.38,911.05 కోట్లు, సర్వీసు పెన్షనర్ల పెన్షన్ల కోసం రూ.16,841.39 కోట్లు, సబ్సిడీల కోసం రూ.9,410.51 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. మూలధన వ్యయం కింద రూ.37,524.70 కోట్లు బడ్జెట్‌లో అంచనా వేయగా కాస్త ఎక్కువగానే రూ.44,252.92 కోట్ల(117.93ు)ను వ్యయం చేశారు. రెవెన్యూ రాబడుల కింద రూ.2,16,566.97 కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.1,69,089.58 కోట్లు (78.08ు) సమకూరాయి. ఇందులో పన్నుల కింద రూ.1,52,499.49 కోట్లను అంచనా వేయగా సంవత్సరాంతానికి రూ.1,35,540.17 కోట్లు (88.88ు) సమకూరాయి. అదే గత ఏడాది పన్నుల కింద 100 శాతం రాబడి సమకూరింది. ఈసారి మాత్రం లక్షిత రాబడిలో 11.12 శాతం మేర తగ్గడం గమనార్హం. అన్నింటికంటే రాష్ట్ర ఎక్సైజ్ రాబడులు, కేంద్ర పన్నుల్లో వాటా రాష్ట్ర ఖజానాకు ఊతమిచ్చాయి. రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల కింద రూ.19,884.90 కోట్లను అంచనా వేయగా... రూ.20,298.89 కోట్లు(102.08ు) సమకూరడం విశేషం. ఇక కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.14,528.18 కోట్లను అంచనా వేయగా... రూ.16,536.65 కోట్లు (113.83ు) వచ్చాయి. కానీ... కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు మాత్రం తీవ్ర నిరాశపర్చాయి. ఈ పద్దు కింద అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను ఆశించింది. ఏకంగా రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయగా... మార్చి నెలాఖరు వరకు వచ్చింది రూ.9,729.91 కోట్లు (23.58% ) మాత్రమే.