Share News

Pro Saibaba: సాయిబాబా భౌతిక కాయాన్ని ఆసుపత్రికి అప్పగిస్తాం.. కుటుంబ సభ్యుల ప్రకటన

ABN , Publish Date - Oct 13 , 2024 | 05:38 PM

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్‌ సాయిబాబా (Pro Saibaba, 54) భౌతికకాయాన్ని ఆసుపత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

Pro Saibaba: సాయిబాబా భౌతిక కాయాన్ని ఆసుపత్రికి అప్పగిస్తాం.. కుటుంబ సభ్యుల ప్రకటన

ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్‌ సాయిబాబా (Pro Saibaba, 54) భౌతికకాయాన్ని ఆసుపత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన కళ్లను ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేస్తున్నట్లు చెప్పారు. సాయిబాబా భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు తరలించారు. ఆత్మీయుల నివాళి అనంతరం భౌతికకాయన్ని ఆస్పత్రికి అందజేస్తామని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

తీరని లోటు..

ప్రొ సాయిబాబా మృతిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పౌర హక్కుల ఉద్యమానికి తీరని లోటని అన్నారు. అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం వినిపించారని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆరోగ్యానికి ముప్పు వాటిల్లినా అవిశ్రాంతంగా పోరాడారని పేర్కొన్నారు. పౌర హక్కులను కాపాడే క్రమంలో సవాళ్లు ఎదురైనా సాయిబాబా చూపిన ధైర్యసాహసాలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. సాయిబాబాను కోల్పోవడంతో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


కేంద్రం కుట్రలకు బలి..

ప్రొ సాయిబాబా మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దేశద్రోహ నేరం మోపి 90 శాతం అంగవైకల్యంతో ఉన్న సాయిబాబాను ఉపా చట్టం కింద సుదీర్ఘ కాలంగా జైలులో నిర్బంధించిందని ఆయన మండిపడ్డారు. ఆయనపై బీజేపీ అర్బన్‌ నక్సలైట్‌గా ముద్రవేసిందని అన్నారు. సాయిబాబా జైలులో ఉండగా అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యారని.. ఆయనకు సరైన వైద్య సదుపాయాలు కూడా అందించలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన సాయిబాబా.. దళిత, గిరిజన, వికలాంగుల హక్కుల నేతగా, విద్యావేత్తగా పేరు పొందారని కొనియాడారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.

తీరనిలోటు..

సాయిబాబా మృతి తీరని లోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అన్నారు. వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు.

Read Latest Telangana News and National News

Updated Date - Oct 13 , 2024 | 05:50 PM