ఏసీబీ అదుపులో అంతర్గాం తహసీల్దార్
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:07 AM
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ రమేశ్‌ను ఆయన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. లింగాపూర్ గ్రామ శివారులో గోదావరి నది నుంచి
ఇసుక ట్రాక్టర్‌ను విడిచిపెట్టేందుకు రూ.25వేలు లంచం డిమాండ్
అంతర్గాం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ రమేశ్‌ను ఆయన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. లింగాపూర్ గ్రామ శివారులో గోదావరి నది నుంచి అక్టోబరు 28న రామగుండం పట్టణానికి చెందిన ఆలకుంట సంపత్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకుని తహసీల్దార్‌కు అప్పగించారు. ట్రాక్టర్‌ను వదిలిపెట్టాలంటే రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని నిందితుడు సంపత్‌కు తహసీల్దార్ రమేశ్, ఆర్‌ఐ శ్రీధర్ చెప్పారు. అంత మొత్తం చెల్లించలేనని సంపత్ బతిమిలాడగా.. రూ.25 వేల డీడీ తీయాలన్నారు. ఈ నెల 13న డీడీ పట్టుకుని సంపత్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, తమకు కూడా రూ.25 వేలు ఇవ్వాలని తహసీల్దార్, ఆర్‌ఐ డిమాండ్ చేశారు. రూ.12 వేలకు ఒప్పందం కుదిరింది. అయితే, తహసీల్దార్, ఆర్‌ఐపై కరీంనగర్ ఏసీబీ అధికారులకు సంపత్ ఫిర్యాదు చేశాడు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రూ.12 వేలు ఆర్‌ఐ శ్రీధర్‌కు ఇచ్చాడు. శ్రీధర్ తహసీల్దార్ చాంబర్‌లోకి వెళ్తూ ఏసీబీ అధికారులను చూసి డబ్బులు కార్యాలయం బయట పడేసి పారిపోయాడు. తహసీల్దార్ లంచం డిమాండ్ చేసిన దృశ్యాలు బాధితుడి స్పై కెమెరాలో రికార్డు కావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తహసీల్దార్ రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.