Share News

11 నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:56 AM

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 11 నుంచి యాదగిరిగుట్ట కొండపైకి మొదటి ఘాట్‌ రోడ్‌ మీదుగా ఆటోలను అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు.

11 నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలు

రోజూ 2షిఫ్టుల్లో 100ఆటోలకు అనుమతి

సమీక్షలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య వెల్లడి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 6: ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 11 నుంచి యాదగిరిగుట్ట కొండపైకి మొదటి ఘాట్‌ రోడ్‌ మీదుగా ఆటోలను అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపైన దేవస్థాన పాత ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రోజుకు 100 ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తాయన్నారు. మొదటి షిఫ్టు ఉదయం 3 గంటల నుంచి ఒంటి గంట వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందన్నారు. ప్రతీ షిఫ్టులో 50 ఆటోలు నడుస్తాయని, 25 కొండపైన, 25 కొండ కింద ఉంటాయన్నారు. ప్రతీ ఆటోలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లకు అన్ని రకాల ధ్రువపత్రాలు ఉండాలని, వారిపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఆటో చార్జీలను డ్రైవర్లతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా భక్తులను కొండపైకి చేరవేస్తాయన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో పురాతన సంప్రదాయాలను పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. గతంలో వైటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. కొండపైన భక్తులు టెంకాయలు సమర్పించుకునేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. మరో 10 రోజుల్లో కొండపైన భక్తులు మొక్కు నిద్రలు చేసేందుకు డార్మెటరీ హాలు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

Updated Date - Feb 07 , 2024 | 09:41 AM