కవితకు బెయిలిస్తే మొదటికే మోసం
ABN , Publish Date - Apr 09 , 2024 | 04:56 AM
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ప్రత్యేక కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలను తారుమారు
సాక్ష్యాలు తారుమారు చేసి, సాక్ష్యులపై ఒత్తిడి తెచ్చే ముప్పు
కుమారుడి పరీక్షలనేది బెయిల్‌కి పెద్ద కారణం కానే కాదు
బెయిల్ నిరాకరిస్తూ ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ప్రత్యేక కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలను తారుమారు చేసి తప్పించుకునే ముప్పు ఉందని కోర్టు అభిప్రాయపడింది. కుమారుడి పరీక్షల కోసం కవితకు బెయిల్ ఇవ్వడం తప్పనిసరి కానేకాదని న్యాయమూర్తి కావేరి భవేజా వ్యాఖ్యానించారు. దర్యాప్తులో పాల్గొనకముందు, నోటీసులు అందుకున్న తర్వాత.. కవిత తన ఫోన్లలోని సమాచారాన్ని విధ్వంసం చేసినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని, ఆమె సాక్ష్యులను ప్రభావితం చేశారన్న విషయం కూడా స్పష్టమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కవిత మహిళ అయినప్పటికీ ఆమెకు బెయిల్ ఇవ్వకపోవడానికి ఇవే ప్రధాన కారణాలని న్యాయమూర్తి కావేరి భవేజా వివరించారు. కవిత కుమారుడికి సగం పరీక్షలు ఇప్పటికే ముగిశాయని.. అతని వద్ద సోదరుడు, తండ్రి, పిన్ని తదితరులు ఉన్నారని న్యాయమూర్తి గుర్తుచేశారు. అసలు కవిత కుమారుడు ఏం చదువుతున్నాడు? ఎన్నిరోజులు బెయిల్ కావాలి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదని.. అతడి వద్ద ఉన్న సన్నిహిత బంధువులు అతనికి ఎందుకు మానసిక మద్దతు అందించలేరో వివరించలేదని పేర్కొన్నారు. కవిత 19 ఏళ్ల పెద్ద కుమారుడు స్పెయిన్‌లో తల్లిదండ్రులు తన పక్కన లేకుండానే చదువుకో గలుగుతున్నప్పుడు.. బంధువులు పక్కన ఉండగా చిన్న కుమారుడు పరీక్షలు ఎందుకు రాయలేడని ప్రశ్నించారు. టెక్నాలజీ యుగంలో తండ్రి ఇతర బంధువులు, సోదరుడు డిజిటల్ ఉపకరణాల ద్వారా కూడా కవిత కుమారుడితో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. చదువుకున్న, సంపన్నులైన మహిళలు ఈరోజుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, అక్రమ కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారని, అందువల్ల కోర్టు అలాంటి వారికి బెయిల్ ఇచ్చేముందు న్యాయ సమ్మతంగా వ్యవహరించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.