యాత్ర పేరిట ‘బండి’ రాజకీయ డ్రామాలు
ABN , Publish Date - Feb 28 , 2024 | 05:17 AM
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాజకీయ డ్రామాలతో ప్రజాహిత యాత్ర చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు.. సంజయ్ జాగ్రత్త: పొన్నం
తెలంగాణలో 17 సీట్లూ బీజేపీ గెలవాలి
అసదుద్దీన్‌ను పార్లమెంటుకు వెళ్లనివ్వొద్దు
కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల అవీనితి
ఒక్క రూపాయి అవినీతి లేకుండా మోదీ పాలన
విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి)/హుస్నాబాద్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాజకీయ డ్రామాలతో ప్రజాహిత యాత్ర చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తన తల్లిపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎంపీగా ఐదేళ్ల పదవీ కాలంలో సంజయ్ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తే.. ఆయన తన తల్లి జన్మకు సంబంధించి వ్యాఖ్యలు చేశారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం ప్రచారం కోసమే సంజయ్ తన యాత్రను కాంగ్రెస్ అడ్డుకున్నట్లు డ్రామాలకు తెరలేపారన్నారు. తాము వాళ్ల యాత్రలు అడ్డుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు అందరికీ ఉంటుందని, కానీ అవివేకమైన మాటలు సరికాదని విమర్శించారు. తనకు శ్రీరాముడు అంటే గౌరవం అని, ఏనాడు శ్రీరాముడి గురించి కాని, అక్షింతల గురించి గాని మాట్లాడలేదని, ఒకవేళ మాట్లాడినట్లు నిరూపిస్తే సజీవ సమాధికి సిద్ధమని సవాల్ విసిరారు. తన మాటలను వక్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల అడగడం కాదు.. అయిదేళ్ల కాలంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు ఆలోచించాలన్నారు. ఇలాంటి నాయకుని డ్రామాలను సమర్థిస్తున్నారా..? అని ప్రశ్నించారు. సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రి హెచ్చరించారు.