Share News

Bandi Sanjay: 6 గ్యారంటీల అమలుపై పాదయాత్ర చేయండి

ABN , Publish Date - Nov 03 , 2024 | 03:41 AM

ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి నమ్మితే.. ఆ అంశాన్ని వివరిస్తూ పాదయాత్ర చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

Bandi Sanjay: 6 గ్యారంటీల అమలుపై పాదయాత్ర చేయండి

  • సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సవాల్‌

  • కాంగ్రెస్‌ గ్యారంటీలు.. నీటి మీద బుడగలే

  • నెరవేర్చడానికి పదివేల రోజులూ సరిపోవని వ్యాఖ్య

హైదరాబాద్‌/మల్యాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి నమ్మితే.. ఆ అంశాన్ని వివరిస్తూ పాదయాత్ర చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. ప్రజల వద్దకు వెళ్తే.. నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు అన్నది అవాస్తవమని, వాటిని నెరవేర్చడానికి వెయ్యి రోజులు కాదు.. 10వేల రోజులు కూడా సరిపోవని తేల్చిచెప్పారు. గ్యారంటీలు, హామీల పేరుతో యావత్‌ తెలంగాణను కాంగ్రెస్‌ మోసం చేసిందని దుయ్యబట్టారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ను ఉద్దేశించి ‘ఎక్స్‌’ వేదికగా బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ సర్కారు అవాస్తవ హామీలు రాష్ట్రాన్ని, ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ గ్యారంటీలంటే నీటి మీద బుడగలేనని నిరూపించారని ఎద్దేవా చేశారు.


పీఎం ఆవాస్‌ యోజన ద్వారా కేంద్రం పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాగా, జగిత్యాల జిల్లా మల్యాలలో సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌ నుంచి మంజూరైన రూ.25కోట్లతో మల్యాల క్రాస్‌ రోడ్డు నుంచి మేడిపల్లి మండలం కాచారం వరకు 11.7కిలోమీటర్ల ముక డబుల్‌రోడ్డు విస్తరణ పనులను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ పంతాలు.. పట్టింపులతో సాధించేదేమీ లేదని, ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అందరం ప్రజా సేవకులమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు.


గత(బీఆర్‌ఎస్‌) ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తితో కేంద్ర నిధులను దారి మళ్లించిందని విమర్శించారు. చాలా రోజుల తరువాత మల్యాలలో ప్రొటోకాల్‌ పాటించడం మంచి సంప్రదాయమని, కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణులు కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం బాగుందన్నారు. ఇక ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి అభివృద్ధి పనుల్లో సహకరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారం అవసరమన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రహదారి పనుల శిలాఫలకం ఆవిష్కరణ తర్వాత తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలతో బండి సంజయ్‌ కొంత సేపు సరదాగా గడిపారు. అనంతరం కొండగట్టులో అల్పాహారం చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి ముచ్చటించారు.

Updated Date - Nov 03 , 2024 | 03:41 AM