తప్పుడు పత్రాలతో బ్యాంకులకు రూ. 266.74 కోట్ల బురిడి
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:45 AM
తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులను బురిడి కొట్టించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బ్లాసమ్స్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ కంపెనీపై
2.43 కోట్ల బ్లాసమ్స్ ఆయిల్ కంపెనీ ఆస్తుల అటాచ్
కొనసాగుతోన్న ఈడీ విచారణ
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులను బురిడి కొట్టించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బ్లాసమ్స్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఆ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు ఇండియన్ ఓవర్సిస్, ఇండియన్ బ్యాంకులకు తప్పుడు బ్యాలెన్స్ షీట్లు, ఇతర పోర్జరీ పత్రాలు సమర్పించి రూ. 266.74 కోట్ల రుణం పొందారు. ఆ మొత్తాన్ని సంస్థ అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు, వ్యక్తిగత ఖాతాలకు దారి మళ్లించారు. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2019లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సంస్థకు సంబంధించిన రూ. 2.43 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. తాము అటాచ్ చేసిన ఆస్తుల్లో నివాస సముదాయాలతోపాటు, వ్యాపార సముదాయాలు ఉన్నట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు తెలిపారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.