ప్రమాదంలో పెద్ద పులులు!
ABN , Publish Date - Jan 09 , 2024 | 04:55 AM
ఆసిఫాబాద్ జిల్లాకు సరిహద్దునే ఉన్న బల్లార్షా-చంద్రాపూర్-అహిరి అడవుల్లో పెద్ద పులుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి.
ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు అడవుల్లో రెండ్రోజుల వ్యవధిలో 2 పెద్దపులుల మృతి
గత 8 నెలల్లో మొత్తంగా 9 పులుల మృత్యువాత
అన్నీ ఆడపులులే.. మహారాష్ట్ర నుంచి సంతానోత్పత్తి కోసం రాక
మృతికి ఇలాకాపై ఆధిపత్య పోరే కారణం అంటున్న అధికారులు
దీనిపై విమర్శలు..
పులుల రాకపై స్థానికుల ఫిర్యాదు.. పట్టని అధికారులు
నెపాన్ని ‘ఆధిపత్య పోరు’ ఖాతాలో వేసి చేతులు దులుపుకొంటున్న వైనం
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, జనవరి 8: ఆసిఫాబాద్ జిల్లాకు సరిహద్దునే ఉన్న బల్లార్షా-చంద్రాపూర్-అహిరి అడవుల్లో పెద్ద పులుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా ఇక్కడ పులులు మృత్యువాతపడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. రెండ్రోజుల్లో రెండు పెద్ద పులులు మృతిచెందడం చర్చనీయాంశమవుతోంది. శనివారం రాత్రి కాగజ్‌నగర్‌కు సమీపంలోని దరిగాం అటవీప్రాంతంలో ఎస్-15 అనే రెండేళ్ల వయసున్న పులి.. సోమవారం ఎస్-9 అనే ఆరేళ్ల పులి మృతిచెంది ఉండటాన్ని అధికారులు కనుగొన్నారు. గత ఎనిమిది నెలల్లో ఆసిఫాబాద్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని బల్లార్షా-చంద్రాపూర్-అహిరి అడవుల్లో తొమ్మిది పెద్దపులులు ఇదే తరహాలో మృతిచెందాయి. చనిపోయినవన్నీ కూడా ఆడపులులే. సంచరిస్తున్న ఇలాకా మీద ఆడపులల మధ్య ఆధిపత్య పోరు, ఫలితంగా పరస్పరం తలపడటమే మృతికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా వారు ఈ నిర్ధారణకు అనుమానాలకు తావిస్తోంది. పైగా ఇలాకా విషయంలో మగ పులుల మధ్యే ఆధిపత్య పోరు ఉంటుందని, ఆడపులుల మధ్య ఉండదని వన్య ప్రాణ నిపుణులు చెబుతుండటం గమనార్హం. ఒక ప్రాంతంలో సంచరిస్తున్న మగపులి.. అక్కడికి మరో మగపులి వస్తే.. దానితో తలపడుతుందని.. ఈ పోరు కొన్నిసార్లు రెండిట్లో ఒకదాని మృతికి కారణమూ అవుతుందని అంటున్నారు. ఆడపులులు మాత్రం అరుదైన సందర్భాల్లో తమ పిల్లలను కాపాడుకునేందుకే మరో పులితో తలపడుతుంటాయని, వాటి మధ్య ఆధిపత్య పోరు ఉండదని స్పష్టం చేస్తున్నారు. రెండు పులుల కళేబరాల ఆవశేషాలను పరీక్షల కోసం అధికారులు ల్యాబ్‌కు పంపారు.
విషాహారంతోనేనని అనుమానాలు
ఆసిఫాబాద్ జిల్లా కడంబా అటవీప్రాంతం పులుల ఆవాసానికి అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా ఇక్కడికి మహారాష్ట్ర నుంచి గర్భం దాల్చడానికి ఆడ పులులు ఎక్కువగా వస్తుంటాయి. పిల్లలను మగపులుల బారినుంచి రక్షించుకునేందుకు అనువైన భౌగోళిక అనుకూలతలు ఉండటంతో ఇక్కడ సంతానోత్పత్తి చేసేందుకు ఇష్టపడతాయి. జల వనరులు సహజసిద్ధమైన రాతి గుహలు, వెదురు, ఆహారం కోసం లెక్కలు మిక్కిలి శాకాహార జంతువులు ఉండటం కడంబా రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతోంది. 2015 నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి పెద్ద పులుల రాక పెరిగింది. అప్పట్లో ఫాల్గుణ అనే పెద్దపులి కడంబా అటవీ ప్రాంతంలోని రాతి గుహల్లో తొలిసారిగా సంతానోత్పత్తి చేసింది. తర్వాత ఎస్-1 అనే సిరీ్‌సలోని మరో ఆడ పులి కూడా తడోబా నుంచి ఇక్కడికి వలస వచ్చింది. ప్రస్తుతం ఈ రెండిటి సంతానమే ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న బల్లార్షా ప్రాంతంలోనూ సంచరిస్తున్నాయి. ఇటీవల ఒక ఆడ పులి తనరెండు పిల్లలతో కలిసి తరుచూ ఆవాస ప్రాంతాల సమీపంలోకి వచ్చి పోతుండటం, పశువులపై దాడి చేస్తుండటం వంటి ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో దరిగాం గ్రామానికి చెందిన పశువుల కాపర్లు, రైతులు పులుల సంచారంపై ఇటీవల అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అటవీశాఖ సిబ్బంది.. పులల జోలికి వెళ్లొద్దని అక్కడి జనాలకు చెప్పి చేతులు దులుపుకొన్నారు. అయితే అధికారులు తమ గ్రామాన్ని ఖాళీ చేయిస్తారేమోనన్న అనుమానంతో పెద్దపులుల సంచారాన్ని నిరోధించేందుకు అక్కడి జనమే పులలపై విష ప్రయోగం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పైగా పేరు చెప్పేందుకు సిద్ధపడని ఓ అఽధికారి ఇదే విషయాన్ని వెల్లడించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో ఎనిమిది పెద్దపులులు సంచరిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తుండగా 2021లో వేసిన అంచనా ప్రకారం 16 పెద్దపులులు ఇక్కడే పుట్టి పెరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది పులుల్లో ఇటీవల కాలంలోనే 3 మృతి చెందడంతో క్రమంగా కడంబా అటవీప్రాంతం పెద్ద పులులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఇక్కడ పులుల సంరక్షణ కోసం ప్రత్యేక బ్రీడింగ్ కేంద్రం ప్రకటించాలన్న ప్రతిపాదనలకు మోక్షం లభించటం లేదు.
ఆచరణలోకి రాని పులుల సంరక్షణ ప్రాజెక్టు
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకుగాను నిర్ణయించిన పులుల సంరక్షణ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం లేదు. కడంబా అటవీప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా ప్రకటించి పులుల సంరక్షణతోపాటు శాకాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు పచ్చగడ్డి మైదానాల ఏర్పాటు, నీటి కుంటల నిర్మాణం, పెద్ద పులుల సంరక్షణ, పునరుత్పత్తి సదుపాయాల వంటి అంశాలతో జోగురామన్న మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు టైగర్ పేరిట కార్యచరణ తయారు చేశారు. ఇది కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో శిక్షణ పొందిన ప్రత్యేక 50మంది వన్యప్రాణి నిపుణులతో స్పెషల్ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయాలని తలపెట్టారు. కానీ ప్రభుత్వం నిధులు సమకూర్చక పోవటంతో ఈ ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు.