Bandi Sanjay : రామరాజ్యం కావాలా.. రాక్షసుల రాజ్యం కావాలా?
ABN , Publish Date - Feb 11 , 2024 | 04:22 AM
రామరాజ్యం కావాలో.. రాక్షసుల రాజ్యం కావాలో ప్రజలు ఆలోచించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం నుంచి తన ప్రజాహిత యాత్రను
కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో బాబ్రీ మసీదు కడతారు
నాకు రాముడు, మోదీ అండగా ఉన్నారు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పక్షాన రజాకార్ల పార్టీ రాక్షసులు ఉన్నారు
నేను చచ్చిపోవాలని కేసీఆర్ తాంత్రిక పూజలు చేశారు
17 ఎంపీ స్థానాలు మావే: బండి సంజయ్
జగిత్యాల/హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రామరాజ్యం కావాలో.. రాక్షసుల రాజ్యం కావాలో ప్రజలు ఆలోచించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం నుంచి తన ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రజాకార్ రాక్షసులకు వత్తాసు పలుకుతున్న రాహుల్ పాలన కావాలా? నిరంతరం ప్రజల కోసం పోరాడే బీజేపీ కావాలా? రాముడి వారసుల పార్టీ కావాలా? రాక్షసుల వారసుల పార్టీలు కావాలా? దేవుడిని నమ్మే బీజేపీ కావాలా? దేవుడిని నమ్మకుండా హేళన చేసే పార్టీలు కావాలా?’ అని ప్రశ్నించారు. బండి సంజయ్‌కు అండగా ఎవరున్నారని కొందరు నేతలు కూస్తున్నారని, తనకు అండగా శ్రీరాముడు, ప్రధాని మోదీ ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పక్షాన రజాకార్ల పార్టీ రాక్షసులు ఉన్నారని వ్యాఖ్యానించారు. మోదీ ఓబీసీ కాదంటూ హేళన చేస్తున్న రాహుల్ గాంధీకి తనది ఏ కులమో, ఏ మతమో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. మోదీ కులం భారతీయత, మతం హిందూ మతం అని పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో బాబ్రీ మసీదు కడతారన్నారు. కేసీఆర్ పనైపోయిందని, తాంత్రిక పూజలకు నిలయమైన ఫాంహౌ్‌సకు ఎవరూ వెళ్లే సాహసం చేయడం లేదని చెప్పారు. తాను చచ్చిపోవాలని, కాళ్లు, చేతులు పడిపోవాలని కేసీఆర్ తాంత్రిక పూజలు చేసిండని, ఎవరు ఇతరుల నాశనం కోరుకుంటే చివరకు వాళ్లే నాశనమైపోతారన్నారు. కేసీఆర్ వేములవాడకు రూ.500 కోట్లు, కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి.. ఆ దేవుళ్లకు కూడా శఠగోపం పెట్టారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దారుణంగా అవమానించిందని, ఆయన చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం స్వయం ప్రకటిత మేధావి, బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు పొందిన సంస్థను బెదిరించి తన వాళ్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ సంస్థ చేసిన పనుల వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ 17 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తొలిరోజు ప్రజాహిత యాత్ర సక్సెస్
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర తొలిరోజు విజయవంతమైంది. కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రారంభించిన యాత్రకు వేలాది మంది జనం తరలివచ్చారు. యాత్రకు బయల్దేరే ముందు సంజయ్ తన తల్లికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.