Share News

సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ నేత హత్య

ABN , Publish Date - May 02 , 2024 | 05:31 AM

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య అదృశ్యం కేసు విషాదాంతంగా మారింది. ఎల్లయ్యను ఆయన రియల్‌ఎస్టేట్‌ ప్రత్యర్థి, మాజీ నక్సలైట్‌ శ్రీకాంతాచారి దారుణంగా హతమార్చిన

సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ నేత హత్య

గత నెల 18న ఏపీలోని జగ్గయ్యపేటకు ఎల్లయ్య.. అప్పటి నుంచి వీడని ఎల్లయ్య అదృశ్యం మిస్టరీ

జగ్గయ్యపేటలో హత్య.. విశాఖ సముద్రంలో మృతదేహం

ఎల్లయ్య రియల్‌ఎస్టేట్‌ ప్రత్యర్థి శ్రీకాంతచారి ఘాతుకం

భార్యాభర్తల వివాదం సెటిల్మెంట్‌ పేరుతో ట్రాప్‌

శ్రీకాంతాచారి మాజీ నక్సలైట్‌.. అరెస్టు, రిమాండ్‌

జగ్గయ్యపేట, మే 1: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య అదృశ్యం కేసు విషాదాంతంగా మారింది. ఎల్లయ్యను ఆయన రియల్‌ఎస్టేట్‌ ప్రత్యర్థి, మాజీ నక్సలైట్‌ శ్రీకాంతాచారి దారుణంగా హతమార్చిన విషయం వెలుగులోకి వచ్చిం ది. ఈ హత్యలో ఐదారుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. జగ్గయ్యపేటలో హత్య జరగ్గా.. మృతదేహాన్ని విశాఖ వద్ద సముద్రంలో పారేసినట్లు నిర్ధారించారు. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. ఎల్లయ్యకు, శ్రీకాంతాచారికి మధ్య రియల్‌ఎస్టేట్‌ భూవివాదాలున్నాయి. ఈ క్రమంలో ఎల్లయ్యను హతమార్చేందుకు శ్రీకాంతాచారి స్కెచ్‌ వేశాడు. భార్యాభర్తల వివాదాల పరిష్కారంలో ముందుండే ఎల్లయ్యను.. ఆ కోణంలోనే ట్రాప్‌ చేయాలని నిర్ణయించాడు. దీంతో.. గత నెల అపర్ణ అనే మహిళను రంగంలోకి దింపాడు. తన భర్త శ్రీనివాస్‌ అలియాస్‌ ఉపేంద్రతో వివాదాలున్నాయని, అతని నుంచి రూ.20 లక్షలు రావాలని, వాటిని ఇప్పించాలని అపర్ణ కోరడంతో.. పంచాయితీ తీర్చేందుకు ఎల్లయ్య సిద్ధమయ్యారు. గత నెల 18న వీరు కారులో జగ్గయ్యపేటకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఎల్లయ్య తన స్నేహితుడు అంజయ్యను కారులో ఎక్కించుకున్నారు. శ్రీకాంతాచారి, అతని స్నేహితుడు శ్రీనివా్‌స(అపర్ణ భర్తగా చెప్పిన వ్యక్తి), మరికొందరు మిత్రులు అంతకు రెండ్రోజుల ముందే జగ్గయ్యపేటలో మకాం వేశారు. ఎల్లయ్య, అపర్ణ, అంజయ్య జగ్గయ్యపేటకు రాగానే.. శ్రీనివాస్‌ ఫోన్‌ చేశాడు. ఒంటరిగా వస్తే రూ.20 లక్షలు ఇస్తానని ఎల్లయ్యకు చెప్పాడు. దాంతో ఎల్లయ్య తన వెంట ఉన్న అంజయ్య, అపర్ణను ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద దింపేసి, ఒంటరిగా వెళ్లారు. అక్కడ వాష్‌రూమ్‌ పేరుతో అపర్ణ తప్పించుకుంది. శ్రీను, ఎల్లయ్య ఫోన్లు స్విచాఫ్‌ కావడం.. అపర్ణ ఫోన్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో.. అంజ య్య జరిగిన విషయాన్ని ఎల్లయ్య కుటుంబ సభ్యులకు తెలియజేశారు.


దాంతో.. ఎల్లయ్య సోదరుడు సతీశ్‌ సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేత కావడంతో.. పోలీసులు ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. తొమ్మిది సంయుక్త బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాంతాచారిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నించడంతో హత్య గుట్టు రట్టయినట్లు తెలిసింది. గత నెల 18న ఎల్లయ్యను జగ్గయ్యపేట పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్‌లో హతమార్చినట్లు.. మృతదేహాన్ని చేపలను పార్సిల్‌ చేసే బాక్సులో పెట్టి, విశాఖకు తరలించినట్లు శ్రీకాంతాచారి పోలీసులకు వాంగ్మూలమిచ్చినట్లు తెలిసింది. ఎల్లయ్య మృతదేహాన్ని విశాఖ తీరంలో సముద్రంలో పారేసినట్లు శ్రీకాంతాచారి అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు మృతదేహం కోసం సముద్రతీరంలో, జగ్గయ్యపేట అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనివాస్‌, ఇతర నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా.. గత నెల 24న ఎల్లయ్య కారును జగ్గయ్యపేట పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు శ్రీకాంతాచారిపై ఏపీ, తెలంగాణల్లో 34కు పైగా కేసులున్నట్లు తెలిసింది. శ్రీకాంతాచారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని జగ్గయ్యపేట సీఐ జానకిరాం వెల్లడించారు.

Updated Date - May 02 , 2024 | 05:31 AM