Share News

Former CM KCR : బోనస్‌ బోగస్సే

ABN , Publish Date - May 05 , 2024 | 05:35 AM

వరికి రూ.500 బోనస్‌ ఇస్తానని చెప్పిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందని, బోనస్‌ బోగస్‌ అయ్యిందని బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌

Former CM KCR : బోనస్‌ బోగస్సే

వరికి రూ.500 బోనస్‌పై మాటతప్పిన కాంగ్రెస్‌ సర్కారు

లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి

ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం

సింగరేణిని కాపాడుకోవాలన్నా, మంచిర్యాల

జిల్లాగా ఉండాలన్నా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

ప్రధాని నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్‌ కంపెనీ

ప్రాణాలు ఇచ్చి అయినా రాష్ట్రం కోసం పోరాడతా

మంచిర్యాల రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌

మంచిర్యాల, మే 4 (ఆంధ్రజ్యోతి): వరికి రూ.500 బోనస్‌ ఇస్తానని చెప్పిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందని, బోనస్‌ బోగస్‌ అయ్యిందని బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను ప్రజల సౌకర్యార్థం తాను మూడు జిల్లాలుగా విభజిస్తే, వాటిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలను రద్దు చేస్తానంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ తీరుతో మళ్లీ ప్రజలు తమ పనులకోసం ఆదిలాబాద్‌ దారి పట్టాల్సివస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఐదు నెలల ముందు తెలంగాణ ఎలా ఉండేదో గుర్తుచేసుకోవాలని, ఇప్పుడు ఇంతలా ఆగం కావడానికి కారణమేంటో ఆలోచించాలని ప్రజలను కోరారు. ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు రెప్పపాటు సమయమైనా కరెంటు పోలేదు. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి, నీళ్లు ఇచ్చాం. ఇప్పుడు కల్యాణలక్ష్మీ చెక్కులు మాయమయ్యాయి. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చింది. మా ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది. రేవంత్‌ మాత్రం రూ.2 లక్షల మాఫీ చేస్తానని ముందుకు వచ్చాడు? ఇప్పుడు రూ.2 లక్షల దాకా మాఫీ అయ్యిందా?’’ అని ప్రజలను ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలలో ఒకేఒక్క ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారని, మహిళలకు సీట్లు సరిపోక సిగలు పట్టి కొట్టుకుంటున్నారని గుర్తుచేశారు. పల్లె, పట్టణ ప్రగతిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపడితే.. ప్రస్తుత సర్కారు వాటిని పూర్తిగా మాయం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన పనులన్నింటినీ నిలిపివేసిందని, సాగు నీరు అందక లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కాంగ్రెసోళ్లకు సోయి లేకుండాపోయిందని మండిపడ్డారు. మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక జిల్లా అని, అది ఉండాలా? పోవాలా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మొండి వైఖరి, మూర్ఖపు పట్టుదలతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రైతుల నోట్లో మట్టికొట్టే పరిస్థితి తెచ్చిందని, ముఖ్యమంత్రి ఐదెకరాలకే రైతుబంధు అంటున్నాడని, భవిష్యత్తులో దున్నేటోనికే పథకాన్ని ఇస్తానన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారుపైనా కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. ‘‘సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు బంగారం. అలాంటి సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి మోదీ సర్కారు కుట్ర పన్నుతోంది. నరేంద్రమోదీ నా మెడపై కత్తి పెట్టి.. ఆస్ట్రేలియా బొగ్గు కొనాలని ఒత్తిడి తెచ్చారు. దానికి నేను ఒప్పుకోలేదు.


సింగరేణిని కాపాడాలంటే.. బీఆర్‌ఎస్‌ గెలవాలి. కృష్ణా, గోదావరి నదులను మోదీ ఎత్తుకుపోతానంటుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోరు మెదపడం లేదు. మంచిర్యాల జిల్లాను తీసేస్తామంటున్నారు. మంచిర్యాలను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించాలి. నా ప్రాణాలను బలిచేసి అయినా.. రాష్ట్రాన్ని కాపాడతాను’’ అని ఉద్వేగంగా అన్నారు. రైతుల ఆదాయం పెంచుతామన్న మోదీ హామీ ఏమైందని నిలదీశారు. మోదీది గ్యాస్‌ కంపెనీ అని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరు గెలవాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ అన్నివర్గాల ప్రజలను నట్టేట ముంచిందని, బీజేపీతో ఒరిగేదేమీ లేదన్నారు. తెలంగాణకు రక్షణ.. బలం.. బలగం.. అంతా బీఆర్‌ఎస్సేనన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌ హయాంలో గిరిజనులకు 4.5 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చాం. రైతుబంధు అమలు చేశాం. ముస్లింలకు రంజాన్‌ తోఫా ఇచ్చాం. కాంగ్రెస్‌ హయాంలో ఎందుకు ఇవ్వడం లేదు? బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ గెలుస్తున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ప్రజలు మళ్లీ తప్పుచేయొద్దు. మోసపోవొద్దు. గోస పడవద్దు’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. శనివారం సాయంత్రం కేసీఆర్‌ మంచిర్యాల రోడ్‌షోకు వచ్చే ముందు గోదావరిఖని వద్ద బ్రిడ్జిపై ఆగారు. అక్కడ గోదారమ్మకు పూలు, వస్త్రాలు సమర్పించి నమస్కరించారు. అక్కడే కొందరు మహిళలు కేసీఆర్‌కు హారతులతో స్వాగతం పలికారు.

Updated Date - May 05 , 2024 | 05:35 AM