Share News

పంద్రాగస్టులోపు హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:40 AM

‘‘సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్టు పంద్రాగస్టులోపు ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. అలాగే వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలతో పాటు పదమూడు హామీలను కూడా అమలు చేయాలి. అప్పుడు నేను

పంద్రాగస్టులోపు  హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా

లేదంటే సీఎం రాజీనామా చేయాలి

రేపు అమరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దాం: హరీశ్‌రావు

సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్‌/ఖమ్మం ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్టు పంద్రాగస్టులోపు ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. అలాగే వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలతో పాటు పదమూడు హామీలను కూడా అమలు చేయాలి. అప్పుడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే రేవంత్‌ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని ఇద్దరం ప్రమాణం చేద్దాం. ఇందుకోసం శుక్రవారం (ఈనెల 26న) అసెంబ్లీ ముందున్న అమరుల స్తూపం వద్దకు నేను వస్తాను. సీఎం రేవంత్‌రెడ్డి కూడా రావాలి’’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని ఓ హోటల్‌లో విలేకరులతో, ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత పార్టీ నేతల సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడారు. హామీలు అమలు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధానమని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరు 9వ తేదీనే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి చేయనందుకు రేవంత్‌రెడ్డి ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ప్రకటించి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికే ఒక్కో మహిళకు రూ.10 వేలు బాకీ ఉన్నారని, ఈ డబ్బులను ఎలా తీరుస్తారో, మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలనెలా ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, ప్రజా తిరుగుబాటులో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమన్నారు. బీఆర్‌ఎ్‌సది కుటుంబ పాలన అని విమర్శిస్తున్న ఖమ్మం జిల్లా మంత్రులు తమ బంధువులకు ఎంపీ టికెట్ల కోసం ఢిల్లీ , బెంగళూరు చుట్టూ ఎందుకు తిరిగారని ఆయన నిలదీశారు.


సవాల్‌ చేయడం హరీశ్‌కు అలవాటే: దామోదర

ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సవాల్‌ చేయడం అలవాటేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయ్యిందని, తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే ఆరవ గ్యారెంటీని అమలు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీని పక్కాగా అమలు చేస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Apr 25 , 2024 | 04:40 AM