బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే.. పార్టీ మారరని చెప్పగలరా?
ABN , Publish Date - Apr 21 , 2024 | 04:30 AM
‘‘ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన వాళ్లు పార్టీ మారరని చెప్పగలరా..? అసలు నామినేషన్ల ఉప సంహరణ వరకైనా వారు పార్టీలో ఉంటారా..? పోలింగ్ వరకైనా కొనసాగుతారా..? ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న మీరు.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు..?’’
ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారు
గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం.. ఆ పార్టీకి ప్రజలు ఓట్లేయొద్దు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన వాళ్లు పార్టీ మారరని చెప్పగలరా..? అసలు నామినేషన్ల ఉప సంహరణ వరకైనా వారు పార్టీలో ఉంటారా..? పోలింగ్ వరకైనా కొనసాగుతారా..? ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న మీరు.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు..?’’ అని కేసీఆర్‌ను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాదు.. డిపాజిట్ల కోసం ప్రయత్నించాలని సూచించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచినా.. ఆ పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదని చెప్పారు. వరంగల్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తే.. ఆమె కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఓటమిని కేసీఆర్, కేటీఆర్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. పార్టీ నుంచి వలసలు, ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టుతో సతమతమవుతూ.. బీజేపీని విమర్శిస్తున్నారని చెప్పారు. జై శ్రీరామ్ అనండి.. బీజేపీని తొక్కండని కేటీఆర్ మాట్లాడారని.. ఆయన తండ్రిని కామారెడ్డి ప్రజలు బీజేపీ జెండా పట్టుకుని తొక్కారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై రాష్ట్ర ప్రజలకు సోనియమ్మ రాసిన ఉత్తరం ఏమైందని సీఎం రేవంత్‌ను కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ దగా చేసిందని.. హామీలు అమలు చేసే వరకు ఆ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకున్నారని.. ఇప్పుడు ఆగస్టు నుంచి అంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించేందుకు బీజేపీ 5 సీట్లలో సుపారీ తీసుకుందంటూ రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ బెయిల్ ఇవ్వదన్న సంగతి తెలుసుకోవాలని చెప్పారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు బెయిల్ ఇప్పిస్తారా..?’ అని రేవంత్‌ను నిలదీశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్‌రెడ్డి.. రాంనగర్, విద్యానగర్, ఆజామాబాద్, బాగ్ లింగంపల్లి, అంబర్‌పేట్‌లో పర్యటించారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో బీసీ కుల సంఘాలతో సమావేశమయ్యారు.
రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం: ఏలేటి
సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం ఉందని.. జూన్‌లో ఓటుకు నోటు కేసు విచారణ జరుగుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గతంలో టీడీపీకి ఆగస్టు సంక్షోభం ఉండేదని.. రేవంత్ కూడా ఎల్లో కాలేజీకి చెందిన వ్యక్తే అని పేర్కొన్నారు. రేవంత్ కరెంటు తీగ కాదని.. తమను ముట్టుకుంటే తాము ఏ వైర్లమో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆగస్టులో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం స్వీయ విధ్వంసం దిశగా పయనిస్తోందని తెలిపారు.
రేవంత్ భాష సీఎం హోదాకు తగదు: డీకే అరుణ
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20 : తనను ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ముప్పేట దాడి చేస్తున్నారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహిళ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, తనను అవమానానికి గురిచేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. పాలమూరులో ఓడిపోతామన్న భయంతో సీఎం ఇప్పటికే ఐదుసార్లు జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించారని, అభ్యర్థి నామినేషన్‌కు కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. వచ్చిన ప్రతీసారి తనను తిట్టిపోస్తున్నారని, అనరాని మాటలంటున్నారని తెలిపారు. సీఎం వాడే భాష ఇదేనా..? ఆయన ఇంట్లో ఆడవాళ్లు లేరా..? అని ప్రశ్నించారు.