సాగు రైతుల ఖాతాల్లోనే నగదు జమ
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:36 AM
వరి, పత్తి కొనుగోళ్లకు సంబంధించి పంటలు సాగు చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
ధాన్యం, పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వరి, పత్తి కొనుగోళ్లకు సంబంధించి పంటలు సాగు చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయా పంటల కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి అవకతవకలకు తావివ్వొద్దని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సచివాలయం నుంచి మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలు, సౌకర్యాలపై ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నాగర్ కర్నూల్, కామారెడ్డి, జనగామ, మహబూబ్‌నగర్, పెద్దపల్లి జిల్లాల్లోని రైతులను అడిగి తెలుసుకున్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి బోనస్ పొందిన రైతులతోనూ మంత్రి తుమ్మల మాట్లాడారు.