Share News

భార్యాభర్తల మాటలు వింటారా ?

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:28 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. వారికి ఓట్లు వేసి అధికారాన్నిచ్చిన ప్రజలనే భయపెట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరు ఏమి మాట్లాడుకుంటున్నారో వినేందుకు పోలీసులను పెట్టి ఫోన్‌ ట్యాపింగ్‌లు చేయించిందన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకునేవి కూడా

భార్యాభర్తల మాటలు వింటారా ?

గత ప్రభుత్వానిది దుర్మార్గపు ఆలోచన

ఇతరుల ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్‌ మాట్లాడుతున్నారు

అట్ల వింటే.. చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది

వారి మాట విని తప్పులు చేయొద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం

మహబూబ్‌నగర్‌లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్ర

దేశానికే ఆదర్శంగా మా పాలన.. ఇతర రాష్ట్రాల వారు కితాబిస్తున్నారు

వాల్మీకి బోయలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ఎన్నికలయ్యాక సంపత్‌కు పదవి ఇస్తామన్న సీఎం

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. వారికి ఓట్లు వేసి అధికారాన్నిచ్చిన ప్రజలనే భయపెట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరు ఏమి మాట్లాడుకుంటున్నారో వినేందుకు పోలీసులను పెట్టి ఫోన్‌ ట్యాపింగ్‌లు చేయించిందన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకునేవి కూడా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వానిదని మండిపడ్డారు. ‘‘కొద్దిమంది ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్‌ మాట్లాడుతున్నడు. మంది సంసారాల్లో వేలు పెట్టి చూసే పనేంటి ఆయనకు? సిగ్గున్నోడు ఎవడైనా ఇట్ల బరితెగించి మాట్లాడతాడా? వింటే ఏమైతది.. చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తది’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. ఊర్లలో తిరిగే ఆవారాగాళ్లు, తాగుబోతులు, తిరుగుబోతులే ఇలాంటి మాటలు మాట్లాడతారని, కేటీఆర్‌ కూడా బరి తెగించిన వాడిలా, అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నారని, దాని ఫలితం దానికి ఉంటుందని హెచ్చరించారు. కాకపోతే క్రమపద్ధతిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వాల్మీకి బోయలతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినట్లు విన్న అధికారులు ఈరోజు ఊచలు లెక్కబెడుతున్నారని అన్నారు. ‘‘వాళ్లు దుర్మార్గులు, దొంగలు, దోపిడీదారులు.. వాళ్లు చెప్పినట్లు వింటే మీరు జైలుకు పోతారని మేము ఆనాడే చెప్పినం. మిమ్మల్ని తిరిగి కూడా చూడరనీ చెప్పినం. ఇవాళ కేసుల్లో ఇరుక్కున్నవారిని వాళ్లు అయ్యో పాపమని కూడా అనట్లేరు’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతకుముందు రాష్ట్రంలో ఎవరైనా ఫోన్లో మాట్లాడుకోవాలంటే భయపడేవారని, ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితిని తీసుకువచ్చామని తెలిపారు.

వాల్మీకి బోయలపై కాంగ్రె్‌సకు అభిమానం

వాల్మీకి బోయల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యేకమైన అభిమానం ఉందని సీఎం రేవంత్‌ అన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత వారి డిమాండ్లపై పూర్తిస్థాయిలో ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఉద్యోగాలు, ఉపాధిలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. వంద రోజుల్లో రాష్ట్రంలో మంచి పాలనను అందించి జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని రేవంత్‌ పేర్కొన్నారు. తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు కలుస్తున్న ఇతర రాష్ట్రాల వాళ్లు.. చక్కటి పాలన అందిస్తున్నారంటూ కితాబునిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా సచివాలయానికి వచ్చి సీఎంను, మంత్రులను కలిసి చెప్పుకొనే అవకాశం కల్పించామని, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలన తెచ్చామని అన్నారు.

నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎ్‌స కుట్ర

మహబూబ్‌నగర్‌లో తనను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కూడబలుక్కుని కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎంను సొంత జిల్లాలో రాజకీయంగా బలహీన పరిస్తే.. దానిని చూపించి రాష్ట్రమంతా తిట్టుకుంటూ తిరగొచ్చునని కుమ్మక్కయ్యాయన్నారు. ‘‘మహబూబ్‌నగర్‌కు లేక లేక సీఎంగా ఒక అవకాశం వస్తే.. ఎలాగైనా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒక్కటై గూడుపుఠానీ చేస్తున్నరు. గద్వాల సీటు కూడా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు మూసుకుని గెలిచే సీటు. కానీ, ఓటింగ్‌కు ముందురోజు దొరసాని (డీకే అరుణ) వచ్చి అవతల పార్టీలో ఉన్న ఆమె అల్లుడికి ఓట్లు వేయించారు. ఇప్పుడు కూడా అలాంటి గూడు పుఠానీయే జరుగుతోంది’’ అని సీఎం ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో తనను దెబ్బతీస్తే రాష్ట్రమంతటా ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్లవుతుందనే ఈ కుట్ర జరుగుతోందని, ఈ విషయాన్ని ఆ పార్టీలో తనపై అభిమానం ఉన్న కొందరు తనతో చెప్పారని తెలిపారు. కాంగ్రె్‌సను కాదని మరో పార్టీకి ఓటు వేస్తే మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా? అని రేవంత్‌ ప్రశ్నించారు. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ, ఐదేళ్లుగా బీజేపీలో ఉన్న డీకే అరుణ జిల్లాకు ఏమైనా చేశారా? అని నిలదీశారు. డీకే అరుణ కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్‌ ద్వారా నీళ్లు ఏమైనా తెప్పించారా? తుమ్మిళ్ల ప్రాజెక్టు కోసం ఏమైనా కొట్లాడారా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించారా? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు సంక్రాంతికి వచ్చిపోయే గంగిరెడ్ల లాంటి వాళ్లన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు ఎన్నికలు అయిపోగానే ప్రభుత్వంలో మంచి పదవి ఇప్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2024 | 06:28 AM