Chiranjeevi: జీడీపీలో సింహభాగం టూరిజం నుంచే.. ఇదీ భారత్ గొప్పదనం
ABN , Publish Date - Jan 24 , 2024 | 10:45 PM
బుధవారం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో గోల్కొండలో లైట్ అండ్ ఇల్యూమినేషన్ షోని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి & సినీ నటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
బుధవారం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో గోల్కొండలో లైట్ అండ్ ఇల్యూమినేషన్ షోని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి & సినీ నటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. జై శ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయోధ్యకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు భగవంతుడు కల్పించిన అదృష్టమని పేర్కొన్నారు. ఇక గోల్కొండలో ఈ కార్యక్రమానికి తనని ఆహ్వానించినందుకు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాక తనకు గతంలో గోల్కొండలో హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేసిన సందర్భాలు, అలాగే పోరాట సన్నివేశాలు గుర్తొస్తున్నాయని చెప్పారు. గోల్కొండతో తన గతం అమోఘం అని పేర్కొన్న ఆయన.. రామ్ చరణ్‌తో రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు.
తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో UNWTO సభ్యులకు గోల్కొండ గురించి వివరించానని చిరంజీవి పేర్కొన్నారు. మన దేశంలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితులు, టూరిజం వసతులు ఎక్కడ ఉండవని తెలిపారు. ఓవైపు ఎడారి, మరోవైపు మంచు, ఇంకోవైపు అత్యధిక వర్షపాతం వంటి విభిన్న స్థితులు ఉన్నాయని.. ఇదీ మన భారత్ గొప్పదనమని కొనియాడారు. అయితే.. ప్రపంచ టూరిజంలో మనది కేవలం 1.3 శాతమే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెరగాలని, వరల్డ్ టూరిజంలో భారత్ మెరుగైన స్థానంలో ఉండాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. మన జీడీపీలో సింహభాగం టూరిజం నుంచే ఉందన్నారు. ఫిల్మ్ టూరిజం కోసం కిషన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని ప్రశంసించారు. గోల్కొండ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అభివృద్ధి, సాoస్కృతిక వారసత్వం రెండు కళ్లలా ముందుకు సాగాలని ప్రధాని మోదీ అంటుంటారని గుర్తు చేసుకున్నారు.
ఇదే సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయుల కాలంలో గోల్కొండ నిర్మితమైందని అన్నారు. బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలంలో ఇది విరాజిల్లిందని.. సందర్శకులకు గోల్కొండ గొప్పదనం చెప్పేందుకు అధునాతన లేజర్ షోని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక తెలుగు రాష్ట్రాలకు యునెస్కో గుర్తింపు వచ్చిందని.. అందుకు ఉదాహరణే రామప్ప దేవాలయమని చెప్పుకొచ్చారు. వేయి స్థంబాల గుడి, వరంగల్ కోట, భద్రాచలం రాముల వారు, అమ్మవారి శక్తి పీఠం జోగులాంబ, సమ్మక్క సారక్క మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ సారించామన్నారు. 60 కోట్లతో కుతుబ్ షాహీ టూంబ్స్‌ని అభివృద్ధి చేయనున్నామన్నారు. హైదరాబాద్‌లో నేషనల్ సైన్స్ సెంటర్‌ను రూ.400 కోట్లతో నిర్మించబోతున్నామని.. ఎఫిగ్రఫీ మ్యూజియంని కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు.