Share News

CM Revanth: అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్‌ నివేదిక సిద్ధం

ABN , Publish Date - Jun 15 , 2024 | 02:42 AM

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హడావుడిగా చేపట్టిన ప్రభుత్వ భూముల, స్థలాల క్రమబద్ధీకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్‌ అధికారులు నివేదిక రూపొందించారు. ఒక సర్వే నెంబరులో ఎంత మందికి క్రమబద్ధీకరించారు? ఆ మొత్తం భూమి విస్తీర్ణం ఎంత? బహిరంగ మార్కెట్‌లో ఎంత ధర పలుకుతోంది? రిజిస్ట్రేషన్‌ విలువ ఎంత?

CM Revanth: అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్‌ నివేదిక సిద్ధం

  • త్వరలో ప్రభుత్వానికి అందజేత

  • అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమపర్వం

  • రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో

  • యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా

  • రెగ్యులరైజ్‌ చేసిన అధికారులు

  • బీఆర్‌ఎస్‌ నేతల ప్రమేయం

  • వారి ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు,

  • కార్యకర్తల పేర్లపై క్రమబద్ధీకరణ

  • రూ.కోట్ల విలువైన స్థలాలను

  • కారు చవకగా కొట్టేసిన వైనం

  • వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి

  • సీఎం ఆదేశాలతో విచారణ

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హడావుడిగా చేపట్టిన ప్రభుత్వ భూముల, స్థలాల క్రమబద్ధీకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్‌ అధికారులు నివేదిక రూపొందించారు. ఒక సర్వే నెంబరులో ఎంత మందికి క్రమబద్ధీకరించారు? ఆ మొత్తం భూమి విస్తీర్ణం ఎంత? బహిరంగ మార్కెట్‌లో ఎంత ధర పలుకుతోంది? రిజిస్ట్రేషన్‌ విలువ ఎంత? కబ్జాదారులు చేసుకున్న అక్రమ క్రమబద్ధీకరణ వెనుక ఎవరి హస్తం ఉంది? అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారా? వంటి సమగ్ర వివరాలను విజిలెన్స్‌ అధికారులు ఈ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. త్వరలో దీనిని ప్రభుత్వానికి అందజేయనున్నారు.

ఈ నేపథ్యంలో కబ్జాదారులతోపాటు వారికి సహకరించిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవానికి గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఫలితాలు వెలువడే రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు భూముల క్రమబద్ధీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు రాజధాని చుట్టు పక్కల జిల్లాల పరిధిలో ఇది ఎక్కువగా చోటు చేసుకుంది. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల కనుసన్నల్లో ఇదంతా జరిగిందని ఆరోపణలున్నాయి. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ పేరుతో దొడ్డిదారిన కబళించారన్న విమర్శలు వచ్చాయి.

దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు, జీవో 59 కింద జరిగిన భూముల క్రమబద్ధీకరణ వివరాలను సేకరించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమైయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. దీంతో ఈ భూముల వ్యవహారంలో కొంతకాలంపాటు ముందడుగు పడలేదు. అయితే, కోడ్‌ ముగిసిన నేపథ్యంలో, ప్రభుత్వం మళ్లీ దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం.


  • బీఆర్‌ఎస్‌ నేతల పాత్ర

ప్రభుత్వ భూముల అక్రమ క్రమబద్ధీకరణ వ్యవహారం వెనుక బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల పాత్ర ఉందని ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. దీంతో దీనిపై చర్చ మొదలైంది. 2023 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు జీవో 59 కింద పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల అక్రమ క్రమబద్ధీకరణ జరిగింది. గజం విలువ లక్షకుపైగా ధర పలికే హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాల క్రమబద్ధీకరణ చేశారు.

రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోను జీవోను అడ్డుపెట్టుకొని భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకుల ఇళ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల పేర్లపై క్రమబద్ధీకరణ చేయించారు. కొందరు అక్రమదారులు తమకు ఇళ్లు లేకపోయినా దరఖాస్తులు చేసుకొని క్రమబద్ధీకరించుకున్నారు. గతంలో కూల్చిన ఇళ్ల మొండి గోడలకు ఇంటి నెంబర్లు, కరెంట్‌ బిల్లులు తెచ్చుకొన్నారు. మరికొందరు ఒకే ఇంటి నెంబరుపై, ఒకే కరెంటు బిల్లుపై అనేక దరఖాస్తులు చేసి క్రమబద్ధీకరించుకున్నారు. క్రమబద్ధీకరించిన స్ధలాలను కొందరు మరుసటి రోజే విక్రయించారు. వీటన్నింటిపైనా ఇప్పుడు దర్యాప్తు జరగనుంది.

  • అక్రమాలు ఇలా..

  • రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో సర్వే నెంబరు 74లో వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో వివిధ వర్గాల వారికి, సంస్థలకు కేటాయించింది పోగా మిగిలిన 20 ఎకరాల భూమిలో 21 మంది పేర్లపై 12,879 గజాలను మూడు విడతల్లో ఎన్నికల కోడ్‌ వచ్చిన మరుసటి రోజున క్రమబద్ధీకరించారు.

  • ఖమ్మంలో దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని 180 మంది పేర్లపై క్రమబద్ధీకరించారు. ఒకే ఇంటి నెంబరుతో దాదాపు 40 మంది కబ్జాదారులు 6వేల గజాలకు పైగా స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నారు.


  • రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నానక్‌రాంగూడ ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కన రూ.750 కోట్ల విలువైన చేసే 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రూ.31.52 కోట్లకే క్రమబద్ధీకరించారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా ఒకరి పేరుపై ఏడు ప్లాట్లు (6,043 గజాలు), మరో నలుగురి పేర్లపై 17 ప్లాట్లను (15,534గజాలు) క్రమబద్ధీకరించారు.

  • అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26 ఎకరాల వరకు క్రమబద్ధీకరించారు. ఈ మండలంలోని పసుమాముల గ్రామ పరిధిలోని 444, 264, 106, 386, 102 సర్వే నెంబర్లలో సుమారుగా 14,600 చదరపు గజాలను బీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లలో పనిచేసే వారిపేర్లపై, వారి డ్రైవర్ల పేర్లపై క్రమబద్ధీకరించారు. గుడిసెలు, ప్రహరీలను నిర్మించి వాటికి ఇంటి నెంబర్లు, కరెంట్‌ బిల్లులు తీసుకొని ఈ పని చేయించుకున్నారు. హయత్‌నగర్‌ మండలం భాగ్‌హయత్‌లో సర్వే నెంబరు 207, 71/1లో అక్రమ క్రమబద్ధీకరణలు చేశారు.

  • ఖాజాగూడ సమీపంలో ఓ న్యాయవాది కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని (2,742 చదరపు గజాలు) రెగ్యులరైజ్‌ చేశారు. ఒక చిన్న గది నిర్మాణంతో ఏకంగా 8 మంది పేర్ల మీద పది డాక్యుమెంట్ల ద్వారా దీనిని క్రమబద్ధీకరించారు.

  • నిబంధనలకు పాతర

రెగ్యులరైజేషన్‌లో అధికారులు నిబంధనలకు పాతర వేశారు. క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం... సర్కారు స్థలంలో 2020 జూన్‌ 2 నాటికి ఇల్లు నిర్మించుకొని అందులో నివాసం ఉన్న వారికి మాత్రమే జీవో నెంబరు 59 కింద క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వారి ఆధార్‌కార్డులు అదే ఇంటి అడ్ర్‌సతో ఉండాలి. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, ప్రాపర్టీ ట్యాక్స్‌, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్‌ బిల్లు వంటివీ అవసరమవుతాయి. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన క్రమబద్ధీకరణ వ్యవహారంలో చాలా చోట్ల అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు.

Updated Date - Jun 15 , 2024 | 07:04 AM