CM Revanth Reddy: గత పదేళ్లలో కేసీఆర్ పాపాలపై చర్చ జరగాల్సిందే.. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 13 , 2024 | 04:25 AM
ప్రధాన ప్రతిపక్ష (బీఆర్‌ఎ్‌సఎల్పీ) నేతగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు బాధ్యత అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు అర్హుడని, నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ కోసం నిజంగా కొట్లాడే వ్యక్తి అని అన్నారు. అలాంటి వారిని ప్రతిపక్ష నేతగా నియమిస్తే
గత పదేళ్లలో కేసీఆర్ పాపాలపై చర్చ జరగాల్సిందే..
పద్మారావుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి
కేసీఆర్ సీట్లో ఆయన కూర్చోవడంతో సీఎం సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్ష (బీఆర్‌ఎ్‌సఎల్పీ) నేతగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు బాధ్యత అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు అర్హుడని, నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ కోసం నిజంగా కొట్లాడే వ్యక్తి అని అన్నారు. అలాంటి వారిని ప్రతిపక్ష నేతగా నియమిస్తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందన్నారు. సోమవారం కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీకి అప్పగింత అంశంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా.. కేసీఆర్‌కు కేటాయించిన సీట్లో పద్మారావు కూర్చోవడాన్ని గమనించిన రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మొన్న చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండె. ఆ కుర్చీలో ఇప్పుడు పద్మన్న కూర్చున్నడు. ఆయనకు బాధ్యత ఇస్తే.. ఆయనైనా ప్రతిపక్ష నేత బాధ్యత నెరవేరుస్తడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు సభకు ఎందుకు రాలేదని, ఎందుకు మొహం చాటేశారని ప్రశ్నించారు. ‘‘కృష్ణా జలాల గురించి ముఖ్యమైన చర్చ జరుగుతుంటే.. బీఆర్‌ఎస్ పార్టీ యజమాని, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా? తెలంగాణ ప్రజల జీవితాలపై మరణశాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే సభలోకి రాకుండా, సభలో జరుగుతున్న చర్చలో అభిప్రాయం చెప్పకుండా ఎటెటో పోతున్నడు. చంద్రశేఖరరావును సభలోకి రమ్మనండి.. చర్చలో పాల్గొనమనండి. ఈ పదేండ్లలో జరిగిన పాపాలకు కేసీఆరే కారణం. పాపాల భైరవుడు కేసీఆర్ సభలోకి వచ్చి చర్చ చేస్తే... మేం సమాధానం చెప్తాం. కేసీఆర్ సభకు వస్తే ఎంత సమయమైనా చర్చ చేద్దాం’’ అని రేవంత్ అన్నారు. ప్రాజెక్టులను అప్పగించేది లేదనేదే తీర్మానం సారాంశమని, దానికి అనుకూలమో, వ్యతిరేకమో బీఆర్‌ఎస్ తొలుత స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల మాటల వల్ల శత్రువులకు బలం చేకూరుతుందని, శత్రువులకు, దొంగలకు సద్దిమూట మోసే విధానం మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని సూచించారు.
కరీంనగర్‌లో తరిమితే పాలమూరుకు..
2009లో కేసీఆర్‌ను కరీంనగర్ నుంచి అక్కడి ప్రజలు తరిమితే పాలమూరుకు వచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి సమయంలో పాలమూరు ప్రజలు ఆదరించి గెలిపిస్తే.. ఆ జిల్లాకు సంబంధించి కృష్ణా జలాలపై చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకుండా ఫాంహౌ్‌సలో దాక్కున్నారని విమర్శించారు. ‘‘దక్షిణ తెలంగాణ ప్రజలు కృష్ణా జలాల మీదే ఆధారపడి జీవిస్తున్నారు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 10 లక్షల మంది వలస వెళ్లి.. బొగ్గుబాయిలో, ముంబైలో తట్టపని చేసుకుంటూ బతుకుతున్నారు. కేసీఆర్‌ను 2009లో కరీంనగర్ జిల్లా ప్రజలు తరిమితే.. అక్కడి నుంచి పారిపోయి పాలమూరుకు వలస వచ్చిండు. ప్రజలు అయ్యోపాపం వలస వచ్చాడని ఆదరించి ఎంపీగా గెలిపిస్తే అటే పోయిండు. ఇవ్వాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫాంహౌ్‌సలో దాక్కొని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తుండు. ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు, సభ మొత్తం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని, కృష్ణా జలాల్లో 68 శాతం వాటా ఇవ్వాలని తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు హుందాగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి, తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల విషయంలో ఒకేమాట మీద నిలబడ్డామని ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వారిని (హరీ్‌షరావు)ను పంపించి పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు.
నీటి వాటాను అమ్ముకున్నదెవరు?
తెలంగాణకు అన్యాయం చేసింది.. కృష్ణా జలాల్లో రావాల్సిన వాటాను తెగనమ్ముకున్నది ఎవరని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ నీళ్ల దోపిడీకి.. చేపల పులుసుకు అలుసిచ్చిందెవరో చర్చలో తేలాలన్నారు. ముఖ్యమంత్రిగా, నీటి పారుదలశాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో.. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, నీటిపారుదలశాఖ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. స్మితా సబర్వాల్ లేఖ రాశారని ఒక్కరోజైనా చెప్పారా? అని ప్రశ్నించారు. ఈరోజు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత.. లేఖ రాసింది నిజమేనంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారని, అప్పటి ముఖ్యమంత్రి ఆలోచన విధానంతోనే రాసినట్లు చెబుతున్నారని విమర్శించారు. ‘‘అసలు మీ బాధ ఏంది? కేఆర్‌ఎంబీకి అప్పజెప్పాలనా? వద్దనా? వద్దని మేము తీర్మానం పెట్టినపుడు చర్చలకు తావెక్కడిది? ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని ఎందుకు చెప్పడంలేదు? పదండి ఢిల్లీకి పోదామనే మాట నోటికి ఎందుకు వస్తలేదు?’’ అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరికీ విలువలేదని, మాటకు మనుషులకు, అభిప్రాయానికి కూడా విలువలేదని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు మాట్లాడటానికి కూడా ఏమీ లేదన్నారు.