Share News

కొండారెడ్డిపల్లిలో సీఎం దసరా సంబరాలు

ABN , Publish Date - Oct 14 , 2024 | 04:34 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాలు జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన.. పండగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కొండారెడ్డిపల్లిలో సీఎం దసరా సంబరాలు

  • కుటుంబసభ్యులతో కలిసి జమ్మిచెట్టుకు పూజలు

నాగర్‌కర్నూల్‌/వంగూరు/కొడంగల్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాలు జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన.. పండగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం 12:44 గంటలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి హెలికాప్టర్‌లో వచ్చిన సీఎంకు గ్రామస్థులు, అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో హాజరైన మహిళలు బతుకమ్మలతో సాదరంగా ఆహ్వానించారు. కోలాటం, యక్షగానాలు, పూర్ణకుంభంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఘనమైన స్వాగతం లభించింది. హెలీప్యాడ్‌ నుంచి ప్రత్యేక వాహనంలో నూతన గ్రామపంచాయతీ భవన ప్రాంగణానికి చేరుకున్న ఆయన సోలార్‌ పైలట్‌ ప్రాజెక్టు, గ్రంథాలయం, బీసీ కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు.

కొండారెడ్డిపల్లిలో ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తన ఇంటికి చేరుకున్నారు. కుమార్తె నైమిషారెడ్డి ఆయనకు హారతి పట్టారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో సతీమణి గీత, కుటుంబ సభ్యులతో కలిసి జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఇంటికి చేరుకుని అక్కడున్న అభిమానులు, గ్రామస్థులను పలకరించిన తర్వాత 8:30 గంటల సమయంలో రోడ్డు మార్గంలో తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు బయల్దేరి వెళ్లారు.

సీఎం వెంట ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, నారాయణరెడ్డి, రాజే్‌షరెడ్డి ఉన్నారు. కొడంగల్‌లో శనివారం రాత్రి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌లు సుధీర్‌, లింగ్యానాయక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, కడా అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పూలమొక్కలు అందించి సీఎం రేవంత్‌కు స్వాగతం పలికారు.

Updated Date - Oct 14 , 2024 | 04:34 AM