అదానీని ఆపలేం
ABN , Publish Date - Dec 25 , 2024 | 03:16 AM
అదానీ సంస్థలతో ఒప్పందాల అంశం తమ చేతుల్లో లేని విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే గత బీఆర్‌ఎస్ సర్కారు..
ఏరోస్పే్‌సలో డ్రోన్ల తయారీపై ఒప్పందాలను రద్దు చేయలేం
కేంద్రం అనుమతితోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు
మా వంతు చేయాల్సింది చేస్తాం
మణిపూర్ మారణకాండలో కార్పొరేట్ రంగం పాత్ర
ఐప్సో సమావేశంలో సీఎం రేవంత్
రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నేడు ప్రఖ్యాత మెదక్ చర్చికి సీఎం
ఏడుపాయల వనదుర్గ దర్శనానికీ..
హైదరాబాద్/రవీంద్రభారతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అదానీ సంస్థలతో ఒప్పందాల అంశం తమ చేతుల్లో లేని విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే గత బీఆర్‌ఎస్ సర్కారు.. అదానీ సంస్థలతో అనేక ఒప్పందాలు చేసుకుందని, అందులో భాగంగానే రక్షణ రంగంలో డ్రోన్లు, ఇతర వ్యాపారాలు నెలకొల్పారని తెలిపారు. సరళీకృత విధానాలు ఉన్న ప్రస్తుత కార్పొరేట్ యుగంలో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడం కష్టమని చెప్పారు. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత, అఖిల భారత శాంతి, సంఘీభావ సంఘం (ఐప్సో) జాతీయ సలహా కమిటీ చైర్మన్ కొంపల్లి యాదవరెడ్డి రచించిన ‘నట్స్, బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పుస్తకావిష్కరణ సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పే్‌సలో హమాస్-900 పేరుతో డ్రోన్లు తయారవుతున్నాయని, వీటిని గాజాపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌కు పంపిస్తున్నారని ఐప్సో ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ యుద్ధంతో మన చుట్టూ ఉన్న దేశాలతో శత్రుత్వం పెరిగిందని, అదానీ ఏరోస్పే్‌సలో డ్రోన్ల తయారీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. రక్షణ రంగంలో వందశాతం ప్రైవేటు వారిని అనుమతించాలని రాజ్యాంగాన్నే మార్చి కొత్త విధానాలు అమలుచేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ అదానీతోపాటు రక్షణ రంగంలోని ఇతర ప్రైవేటు సంస్థలపైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికోసం ప్రభుత్వం తరఫున చేయాల్సింది తప్పకుండా చేస్తామన్నారు. నేడు ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించే మాట్లాడుకుంటోందని, కానీ.. దేశంలోనూ 2014 నుంచి అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని అన్నారు. 2014 తర్వాత దాదాపు 4వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు. దీనిపై చర్చించేందుకు, వాస్తవాలు బయటపెట్టేందుకు పాలకులకు ధైర్యం లేదని విమర్శించారు.
మణిపూర్ అల్లర్లలో కార్పొరేట్ల పాత్ర..
మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండలో అక్కడి కార్పొరేట్ రంగం పాత్ర ఉందని సీఎం రేవంత్ అన్నారు. అక్కడి సహజ వనరులను దోచుకునేందుకు రెండు గిరిజన జాతుల మధ్య అంతర్యుద్ధాన్ని ఏకే-47 లాంటి మారణాయుధాలు అందించి ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. భారత బలగాలు మణిపూర్ హింసను నియంత్రించలేవా? అక్కడి మారణాయుధాలను సీజ్ చేయలేవా? అని ప్రశ్నించారు. అక్కడి అల్లర్ల వెనక కుట్ర, కుతంత్రం ఉందన్నారు. ఇలాంటి వాటిపై పార్లమెంటులో చర్చ జరగకుండా ఇతర అంశాలపై మాట్లాడుతున్నారని సీఎం ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అనేకమంది తెరవెనక కీలకపాత్ర పోషించారన్నారు. ఐప్సో ప్రధాన కార్యదర్శి ఒబేదుల్లా కొత్వాల్ అధ్యక్షతన జరగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ శాంతిమండలి అధ్యక్షుడు పల్లబ్‌సేన్ గుప్తా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, వి.హనుమంతరావు, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, పాశం యాదగిరి, దిడ్డి సుధాకర్, కేవీఎల్ తదితరులు హాజరయ్యారు.
అన్ని మతాల సారాంశం మానవత్వమే
హైదరాబాద్/మెదక్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రజా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఖండాంతర ఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చి వందేళ్ల వేడుకల్లో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. దీంతోపాటు పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని సందర్శించనున్నారు.