సీఎం భద్రత పటిష్ఠం
ABN , Publish Date - Jan 25 , 2024 | 03:42 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎ్‌సడబ్ల్యూ) పర్యవేక్షిస్తుంది.
సమాచారం లీకవుతుండడంతో
ముఖ్యమంత్రి భద్రతాసిబ్బంది మార్పు
నలుపురంగులోకి మారిన వాహన శ్రేణి
విదేశీ పర్యటన అనంతరం కొత్త
కాన్వాయ్‌లో సచివాలయానికి రేవంత్
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎ్‌సడబ్ల్యూ) పర్యవేక్షిస్తుంది. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. గత సీఎం వద్ద పనిచేసినవారిలో కొందరు ఆ తర్వాత కూడా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల సీఎం సమాచారం బయటకు వెళ్తుండడంతో ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. సీఎంను ఎవరెవరు కలుస్తున్నారు? ఏం జరుగుతోందనే సమాచారం బయటకు వెళ్తోందని ముఖ్యమంత్రి భద్రతకు, పరిపాలనలో అది మంచిది కాదని, భద్రతను మార్చాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. సీఎం విదేశీ పర్యటన పూర్తవ్వగానే.. పాత సిబ్బంది లేకుండా భద్రతలో మార్పులు చేశారు. సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బందితోపాటు.. ఇంటి వద్ద విధుల్లో ఉండే వారినీ మార్చారు. ఇక సీఎం కాన్వాయ్ రంగు కూడా మారింది. కాన్వాయ్‌లో రేవంత్ ప్రయాణించే ల్యాండ్ క్రూయిజర్ కారు మాత్రం ఆయనకు ఇష్టమైన నలుపు రంగులో ఉండేది. మిగతా కార్లు తెలుపు, సిల్వర్ రంగుల్లో ఉండేవి. కాన్వాయ్ శ్రేణి ఒకే రంగులో లేకపోవడం కూడా సీఎం భద్రతకు ముప్పుగా భావించి, మిగతా వాహనాల రంగులను కూడా నలుపులోకి మార్చారు. అయితే కాన్వాయ్‌లో కొత్త వాహనాల కొనుగోలుకు అధికారులు సీఎం వద్ద ప్రతిపాదించగా.. ఆయన అందుకు అంగీకరించలేదు. కొత్త వాహనాల కొనుగోలుకు అధిక వ్యయం అవుతుండటంతో ఖర్చు తగ్గించుకునేందుకు పాత వాహనాల రంగు మార్పును సూచించారు. కాన్వాయ్‌లోని వాహనాలకు టీఎ్‌స07-ఆర్‌ఆర్0009 నంబర్లను యథాతథంగా కొనసాగిస్తున్నారు. రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన అనంతరం బుధవారం కొత్త కాన్వాయ్‌లో సచివాలయానికి వచ్చారు.