Share News

రహదారులపై రద్దీ...

ABN , Publish Date - Jan 13 , 2024 | 12:30 AM

పండుగ కోసం పల్లెలకు చేరుతున్న ప్రజలతో ఉమ్మడి జిల్లాలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారులపై రద్దీ విపరీతంగా పెరిగింది.

రహదారులపై రద్దీ...
పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

పండుగ కోసం పల్లెలకు చేరుతున్న ప్రజలతో ఉమ్మడి జిల్లాలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారులపై రద్దీ విపరీతంగా పెరిగింది. జిల్లాకు వచ్చే మార్గాల్లో వాహనాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల ప్రయాణం నెమ్మదించింది.

చౌటుప్పల్‌ టౌన, రూరల్‌ / బీబీనగర్‌ / కోదాడ రూరల్‌

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని హైదరాబాద్‌- విజయ వాడ(65వ) జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. శుక్రవారం నుంచి విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించడంతో గురువారం సాయంత్రం నుంచే హైదరాబాద్‌ నుంచి వాహనాల జోరు మొదలైంది. శుక్రవారం నగరం నుంచి రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని పట్టణాలకు వెళ్లే వారి వాహనాలు నాలుగు వరసలుగా కదలి వెళ్తున్నాయి.ఆర్టీసీ బస్‌లు, లారీలకు రహదారిపై అవకాశం లేకుండా వాహనాలు పరుగులు తీస్తున్నాయి.

55వేల వాహనాలకు పైగా రాకపోకలు

పంతంగి టోల్‌గేట్‌ వద్ద 16 గేట్లకు 10 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపించారు. సాధారణ రోజుల్లో 35 వేల నుంచి 40వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో శుక్రవారం 55 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించినట్టు జీఎంఆర్‌ ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అత్యవసర సమయాల్లో 1033కి ఫోన చేయాలని శ్రీధర్‌రెడ్డి కోరారు. పండుగకు స్వగ్రామాలకు బయలుదేరే వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన ఫాస్టాగ్‌లను తప్పని సరిచూసుకోవాలన్నారు. వాహనాదారుడి అకౌంట్‌లో సరిపడా నగదు ఉండేలా చూసుకోవాలన్నారు.

కోదాడ సమీపంలోని రాష్ట్ర సరిహద్దులో..

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర సరిహద్దులోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. కొమరబండ నుంచి రామాపురం క్రాస్‌రోడ్డు వరకు వాహనాలు భారీగా ఆంధ్రప్రదేశ వైపునకు తరలివెళ్లాయి. కొమరబండ, దుర్గాపురం, రామాపురం బైపా్‌సల వద్ద పోలీసులు ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.

గూడూరు టోల్‌ప్లాజా వద్ద

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో 19 వేల నుంచి 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా శుక్రవారం రోజు అదనంగా రెండు వేల వాహనాలు పెరిగి 22 వేల వాహనాలు టోల్‌ప్లాజామార్గంలో రాకపోకలు కొనసాగించాయని టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు రద్దీ ఉంటుందన్నారు.

Updated Date - Jan 13 , 2024 | 12:30 AM