Share News

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ డ్రామాలు!

ABN , Publish Date - Jan 10 , 2024 | 05:25 AM

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ఇప్పుడు వాటి ఆచరణ విషయంలో డ్రామాలాడుతోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ డ్రామాలు!

మార్చి, ఏప్రిల్‌లో పార్లమెంటు ఎన్నికలు

ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్‌

అందుకే దరఖాస్తుల కంప్యూటరీకరణ పేరుతో కాలయాపన: బండి సంజయ్‌

సిరిసిల్ల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ఇప్పుడు వాటి ఆచరణ విషయంలో డ్రామాలాడుతోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’లో బండి సంజయ్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, షెడ్యూల్‌ ప్రకారం వచ్చే మార్చి, ఏప్రిల్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగబోతున్నాయని, ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయం తెలిసి దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని, అయినా గత ప్రభుత్వం మాదిరిగా అహంకార పూరితంగా ప్రతి విమర్శలు చేస్తే బీఆర్‌ఎస్‌ నేతలకు పట్టిన గతే కాంగ్రె్‌సకు పడుతుందని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెకిస్తారో? ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తారో? ప్రజలకు వెల్లడించాలని కోరారు. పదేళ్లలో ఒక్క కొత్త రేషన్‌ కార్డు ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు రేషన్‌ కార్డు ప్రతిపాదినతో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. అప్పుల నుంచి తెలంగాణ గట్టెక్కాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు కావాలన్నా కేంద్ర సాయం అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి అదనపు నిధులు రావాలంటే తెలంగాణ నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. భారత్‌ను, ప్రధాని మోదీని దూషిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మాల్దీవుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నానని బండి సంజయ్‌ అన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 05:25 AM