బీజేపీని అడ్డుకోకుంటే రాజ్యాంగానికి ముప్పు
ABN , Publish Date - May 05 , 2024 | 05:43 AM
బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోని పక్షంలో రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ముప్పు తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
రిజర్వేషన్లను కూడా ఆ పార్టీ రద్దు చేస్తుంది
రేవంత్ సర్కారు ఐదేళ్లూ అధికారంలో ఉంటుంది
కూల్చేందుకు ప్రయత్నించే వారే పతనమవుతారు: ఒవైసీ
హైదరాబాద్, మే 4(ఆంధ్రజ్యోతి): బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోని పక్షంలో రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ముప్పు తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మోదీ ప్రభుత్వం హిందుత్వమే ఏకైక ఎజెండాగా దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. శనివారం చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ షాలిబండ ప్రాంతంలో ఒవైసీ పాదయాత్రతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని విశ్వసించడం లేదని విమర్శించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ నినాదాలు చేసే మోదీ ముస్లింలపై విషం చిమ్ముతూ జిహాదీలుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. మోదీ గ్యారెంటీలంటే రాజ్యాంగాన్ని మార్పు చేయడం, రిజర్వేషన్లను రద్దు చేయడం, మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడమేనన్నారు. మోదీ ఈసారి 400 సీట్లు అంటుండడం రాజ్యాంగాన్ని మార్చేయడంతో పాటు రిజర్వేషన్లను రద్దు చేయడానికేనని విమర్శించారు. హైదరాబాద్, తెలంగాణలో ఓట్ల కోసం బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఉద్రిక్త వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిదేళ్లూ అధికారంలో కొనసాగుతుందని ఒవైసీ పేర్కొన్నారు. రేవంత్ సర్కారును కూల్చడానికి ప్రయత్నించేవారే కూలిపోకతప్పదన్నారు. తాము కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తూనే ఎవరైనా రేవంత్ సర్కారును అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తే.. రేవంత్‌కు మజ్లిస్ అండగా నిలుస్తుందన్నారు.