ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్
ABN , Publish Date - Apr 05 , 2024 | 05:59 AM
చల్లని సాయంత్రం వేళ శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు తెలంగాణ విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. ఉప్పల్ గ్రౌండ్ నుంచి రావాల్సిన కరెంటు బకాయిలు చెల్లించలేదనే కారణంతో అధికారులు గురువారం మధ్యాహ్నం
రూ.1.67 కోట్ల మేర బిల్లు బకాయిలు
2015లోనే విద్యుత్తు చౌర్యం కేసు నమోదు
ఆపై రెండుసార్లు బిల్లు కట్టాలని నోటీసులు
ఎట్టకేలకు గురువారం రాత్రి పునరుద్ధరణ
నేడు సన్‌రైజర్స్-చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్
జోరుగా ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా
ఒక్కోటి రెండు, మూడు రెట్లకు విక్రయం
హైదరాబాద్ సిటీ/ఉప్పల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): చల్లని సాయంత్రం వేళ శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు తెలంగాణ విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. ఉప్పల్ గ్రౌండ్ నుంచి రావాల్సిన కరెంటు బకాయిలు చెల్లించలేదనే కారణంతో అధికారులు గురువారం మధ్యాహ్నం స్టేడియానికి కరెంట్ బంద్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే, హెచ్‌సీఏ అధికారులు చర్చలు జరపడంతో ఎట్టకేలకు గురువారం రాత్రి 9 గంటలకు అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. శుక్రవారం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ ఉంది. అయితే శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు విద్యుత్ శాఖ నుంచి పిడుగులాంటి వార్త వచ్చింది. హెచ్‌సీఏ ప్రతినిధులు ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని విద్యుత్ అధికారులు తొమ్మిదేళ్ల క్రితం కేసు పెట్టారు. దీనిపై హెచ్‌సీఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఉప్పల్ స్డేడియంలో విద్యుత్ చౌర్యం జరిగిందని తేలింది. దీంతో ట్రాన్స్‌కో అధికారులు ఫిబ్రవరిలో రూ.1.67 కోట్ల బకాయిలు చెల్లించాలని హెచ్‌సీఏకు నోటీసులు అందజేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే కట్..
విద్యుత్ బకాయిలు చెల్లించకుండా స్టేడియం నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని హబ్సిగూడ ఎస్‌ఈ రాముడు తెలిపారు. 2015లో స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైందని చెప్పారు. గత ఫిబ్రవరి 20న ఒకసారి, 15 రోజుల క్రితం మరోసారి నోటీసులు పంపించామని.. స్పందించకపోవడంతో కరెంట్ కట్ చేశామని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బకాయిలు రాబట్టుకునేందుకే విద్యుత్‌ను నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, విద్యుత్ శాఖ అధికారులు అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోవడంతోనే సరఫరాను నిలిపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, గురువారం మధ్యాహ్నం నుంచి హెచ్‌సీఎ ప్రతినిధులు జనరేటర్ వినియోగిస్తున్నారు. శుక్రవారం జరిగే మ్యాచ్ కోసం క్రీడాకారులు గురువారం జనరేటర్ వెలుగుల మధ్యనే ప్రాక్టీస్ చేశారు.
ఐపీఎల్‌లో బ్లాక్ టికెట్ల దందా
ఐపీఎల్ టికెట్లలో బ్లాక్ దందా జోరుగా సాగుతోంది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య ఉప్పల్‌లో మ్యాచ్ జరగనుంది. చెన్నై తరఫున ధోనీ ఆడుతుండటంతో.. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో టికెట్లు దొరికిన కొంత మంది వాటిని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. రూ.2వేల టికెట్‌ను రూ.6వేలకు, రూ.10 వేల టికెట్‌ను రూ.20వేలకు అమ్ముతున్నారు. కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు కొని.. వాటిని బ్లాక్‌లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.