దైవ దర్శనానికి వచ్చి వెళ్తుండగా దుర్మరణం
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:24 AM
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు.
కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న వైనం
విద్యార్థి, డ్రైవర్ మృతి... మరో ఐదుగురికి గాయాలు
భువనగిరిలో ఘటన
భువనగిరి టౌన్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఈ విషాదం నెలకొంది. పట్టణ ఎస్‌ఐ కుమారస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ రామంతపూర్‌కు చెందిన ఇంటర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు బుధవారం ఉదయం కారులో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. కారు భువనగిరి బైపాస్ రోడ్డు టీచర్స్ కాలనీ సమీపంలో అదుపుతప్పి టీచర్స్ కాలనీ అండర్‌పాస్ బ్రిడ్జిపై అదుపు తప్పి పల్టీలు కొడుతూ చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి తేరాల యశ్వంత్(17), డ్రైవర్ అబ్దుల్ సుఫియాన్(35) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులు శ్రీను, సకీబ్ తీవ్రంగా గాయపడటంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు అర్జున్, నితీష్, మణిజయంత్‌కు స్వల్పగాయాలు కాగా, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేశారు. బోల్తా పడిన కారు చెట్టును ఢీకొని నిలిచిపోగా, కారు డోర్లను పగులగొట్టి అందులోని మృతదేహాలను వెలికితీశారు. పెద్ద శబ్దంతో కారు చెట్టును ఢీకొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో మరే వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
మర్రిగూడ, (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మండలంలోని లెంకలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. మర్రిగూడ ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నిడమనూరు మండలం మారుపాక గ్రామానికి చెందిన పోలే వంశీ(25) చండూరు మండల కేంద్రంలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పనిని ముగించుకుని అత్తగారి ఉరు అయిన మర్రిగూడ మండలం మేటిచంద్రాపురం గ్రామానికి వస్తుండగా మండలంలోని లెంకలపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని ఢీకొనడంతో మృతిచెందాడు. వంశీ భార్య మనీషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం కోసం దేవరకొండ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.