Share News

కూలీలకు పెరిగిన డిమాండ్‌

ABN , Publish Date - Dec 26 , 2024 | 01:11 AM

వ్యవసాయ పనుల్లో కూలీల కొరత కారణంగా రైతులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఎరువు, పురుగు మందుల ధరలు పెరిగి రైతులు అల్లాడుతున్నారు. ఇప్పుడు కూలీ రేట్ల పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయ్యింది.

కూలీలకు పెరిగిన డిమాండ్‌
సిర్సపల్లి గ్రామంలో వరినాట్లు వేస్తున్న కూలీలు

హుజూరాబాద్‌రూరల్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పనుల్లో కూలీల కొరత కారణంగా రైతులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఎరువు, పురుగు మందుల ధరలు పెరిగి రైతులు అల్లాడుతున్నారు. ఇప్పుడు కూలీ రేట్ల పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయ్యింది. యాసంగి నాట్లు ఊపందుకోవడంతో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వారు రేట్లు పెంచేశారు. అదును దాటితే దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని రైతులు అదనపు భారం మోయడానికి సిద్ధపడుతున్నారు. పదిరోజుల్లోనే 30 నుంచి 40 శాతం రేట్లు పెరిగాయి. నాటు వేసే వారికి మూడు వందలు ఇచ్చే కూలి ప్రస్తుతం నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు పెరగింది. పారతో వచ్చి ఒడ్లు చెక్కితే గతంలో మూడు వందలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఐదు వందల నుంచి వెయ్యి వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తరాది నుంచి కూలీలు వచ్చినా కొరత తీరడం లేదు. యాసంగి నీటి విడుదలపై అధికారులు షెడ్యూల్‌ విడుదల చేయడంతో రైతులందరూ వరినాట్ల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక బస్తా ఎరువు చల్లితే 130, దానిలోఏదైనా మిశ్రమం కలిపితే (గుళికలు, జింకులాంటి) 150 రూపాయలకు కూలి పెంచారు. గతంలో ఈ కూలీ వంద నుంచి 130 రూపాయలుగా ఉండేది. నాట్లు వేసిన తరువాత నాట్ల మధ్య బాటలు తీసే కూలీ రేట్లను 350 నుంచి 400 రూపాయలకు పెంచారు.

ఫ వ్యవసాయ పనులపై కూలీల అనాసక్తి

వ్యవసాయ పనులపై కూలీలు ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ కూలీల్లో 80 శాతానికి పైగా ప్రస్తుతం 50 ఏళ్లకు పైబడిన వారే కావడం గమనార్హం. వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ ఎక్కువ అవడంతో కొత్తతరం వ్యవసాయ పనుల వైపు రావడం లేదు. ప్రస్తుత తరానికి నాట్లు వేయడం తెలియకపోవడం కూలీ కూలీల కొరతకు కొంతకారణంగా భావిస్తున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదనకు యువత పట్టణాల వైపు చూస్తుండడంతో వ్యవసాయ పనుల్లో మానవ వనరులు తగ్గిపోతున్నాయి.

కూలీల రేట్లు

--------------------

పని వానాకాలంలో.. ప్రస్తుతం

(రూపాయల్లో) (రూపాయల్లో)

----------------------------------------------------------------

వరి నాటు 300 400 నుంచి 500

ఒడ్లు చెక్కేందుకు 300 500 నుంచి 1,000

ఎరువు చల్లేందుకు 100 150

(బస్తాకు)

బాటలు తీసేందుకు 350 400

Updated Date - Dec 26 , 2024 | 01:11 AM