Share News

Deputy CM : త్వరలో బిల్లులు

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:40 AM

రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు సంబంధించి రూ.10 లక్షల లోపు పెండింగ్‌ బిల్లులను ఆమోదించే ఆలోచన ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Deputy CM : త్వరలో బిల్లులు

రూ.10 లక్షల లోపు ఉన్న వాటికి ఆమోదం

పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు చెల్లింపు

వారి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సర్కారు యోచన

వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నిరుడు డిసెంబరుకు రూ.1,300 కోట్ల పెండింగ్‌

రూ.400 కోట్లు విడుదలయ్యే అవకాశం

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు సంబంధించి రూ.10 లక్షల లోపు పెండింగ్‌ బిల్లులను ఆమోదించే ఆలోచన ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు గత ఏడాది డిసెంబరు 7వ తేదీ నాటికి పూర్తి చేసిన పనుల తాలూకు రూ.1,300 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. వీటిలో రూ.10 లక్షల లోపు బకాయిలు దాదాపు రూ.400 కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ బిల్లులను క్లియర్‌ చేసే ఆలోచన చేస్తున్నామని, ఈ మేరకు వీటిని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులతో పనులు చేయించి, బిల్లులను పెండింగ్‌లో పెట్టారని, వారిని వీధిపాలు చేశారని భట్టి విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలే బిల్లుల విడుదల కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామంటున్నారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధుల పెండింగ్‌ బిల్లుల గురించి బీఆర్‌ఎస్‌ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని డిప్యూటీ సీఎం హితవు పలికారు.

Updated Date - Dec 25 , 2024 | 03:45 AM