మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:48 AM
గొల్లపల్లి మండలం మల్లన్న పేట మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడవ బుధవారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
బోనాలు సమర్పించి మొక్కుల చెల్లింపు
గొల్లపల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : గొల్లపల్లి మండలం మల్లన్న పేట మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడవ బుధవారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు బెల్లం పానకంతో వండిన బోనాలను నెత్తిన ఎత్తుకుని, స్వామివారికి ప్రీతిపాత్రమైన బంతిపూలు మెడలో ధరించి ఒగ్గు పూజారుల ఢమరుకనాదాల నడమ ఆలయం వద్దకు ఊరేగింపుగా తరలివచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు పుట్టువెంట్రుకలు తీయంచగా, మరి కొందరు నిలువెత్తు నల్ల బంగారం (బెల్లం) తులాభారం వేసి భక్తులకు పంచి పెట్టారు. మల్లన్న పట్నాలు వేసి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కొండూరి రాజేంధర్ శర్మ, కొండూరి రఘు వేధమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టికెట్ల ద్వారా ఆలయానికి రూ. 40,680 ఆదాయం సమకూరి నట్లు ఆలయ పౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య తెలిపారు. ఎస్సై చిర్ర సతీష్ కుమార్ ఆధ్వర్యం లో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. జాతర ఉత్సవాలను ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్, ఆలయ ఈవో విక్రమ్, ఆలయ పౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు సిద్దంకి నర్సయ్య, గోస్కుల రాజన్న, భేర కిషోర్, భీమ సత్తయ్య, నాయకులు సిద్దంకి మల్లయ్య, వెంకటి, చందు, సుధాకర్ పాల్గొన్నారు.
ఫజాతరలో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గుర్రం సాయి కృతిక్ అనే ఐదేళ్ల బాలుడు జాతరలో తప్పిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై చిర్ర సతీష్ కుమా ర్ బాలుడిని వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. సిబ్బందికి బాలుడి తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.