Share News

‘ధరణి’ పెండింగ్‌ దరఖాస్తులు నెలలో క్లియర్‌!

ABN , Publish Date - Feb 09 , 2024 | 04:07 AM

ధరణిలో పెండింగ్‌ ఉన్న దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీటి పరిష్కారం కోసం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.

‘ధరణి’ పెండింగ్‌ దరఖాస్తులు నెలలో క్లియర్‌!

వీటి పరిష్కారానికి గ్రామ సభల నిర్వహణ

మధ్యంతర నివేదికను సిద్ధం చేసిన ధరణి కమిటీ.. త్వరలోనే ప్రభుత్వానికి అందజేత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ధరణిలో పెండింగ్‌ ఉన్న దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీటి పరిష్కారం కోసం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ను ఆధారంగా వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా వివిధ జిల్లాల నుంచి సీసీఎల్‌ఏకు వచ్చి పెండింగ్‌లో ఉన్న 2.31 లక్షల దరఖాస్తులతోపాటు పార్ట్‌-బిలో నమోదు చేసిన 18 లక్షల అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన కీలక సిఫారసులను ధరణి కమిటీ తన మధ్యంతర నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ఈ నివేదికను కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. ధరణి కమిటీ కన్వీనర్‌, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్‌, సభ్యులు మాజీ సీసీఎల్‌ఏ రేమండ్‌ పీటర్‌, కోదండరెడ్డి, మధుసూదన్‌లతోపాటు సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.లచ్చిరెడ్డి.. భూములతో ముడిపడి ఉన్న ఆయా శాఖల ఉన్నత అధికారులతో దాదాపు 15రోజులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు గుర్తించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు పలు సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించారు. ఇందులో కమిటీ రెండు ప్రధానమైన సిఫారసులు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీటిలో మొదటి సిఫారసు విషయానికివస్తే.. 2017లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అధికారులు భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి అప్పుడు భూ రికార్డులను పార్టు-ఎ, పార్ట్‌-బిగా విభజించారు. పార్ట్‌-ఎలో వివాదాలు లేని, రికార్డులు స్పష్టంగా ఉన్న వాటిని నమోదు చేశారు. పార్ట్‌-బిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు సంబంధించినవి, అభ్యంతరాలున్న పట్టా భూములను నమోదు చేశారు. పట్టా భూమి అయినప్పటికీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య నెలకొన్న వివాదాలు, కోర్టుల పరిధిలో ఉన్నవి, ఎండోమెంట్‌, వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నవి, అటవీ శాఖకు చెందిన భూములను పార్ట్‌-బిలో నమోదు చేశారు. వారసుల మధ్య పంపకాల సందర్భంగా నెలకొన్న వివాదాలు, పీవోబీ జాబితాలోని భూములు నమోదు చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించాలి. ఈ సదస్సులకు తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారు, ఆర్‌ఐ, సర్వే అధికారులు హాజరై పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ పేర్కొన్నట్టు తెలిసింది. ధరణి చట్టంలో మార్పులు చేయకుండానే ఓ సర్క్యులర్‌ ద్వారా తహశీల్దారుకు అధికారాలు కట్టబట్టవచ్చని కమిటీ సూచించినట్టు తెలిసింది.

ఆ సమస్యల పరిష్కారానికి చట్టసవరణ!

రెండో సిఫారసులో భాగంగా దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికి చట్ట సవరణ అవసరమని కమి టీ పేర్కొన్నట్టు సమాచారం. కమిటీ ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఎండోమెంట్‌, వక్ఫ్‌బోర్డు, సర్వేలాండ్‌ సెటిల్‌మెంట్‌, రిజిస్ట్రేషన్‌, అటవీశాఖ, గిరిజన సంక్షేమశాఖ, టీఎ్‌సఐఐసీతో సమావేశమైంది. ఆయా శాఖల నుంచి సమస్యలు, పరిష్కార మార్గాలు, సూచనలు, సలహాలు స్వీకరించింది. ధరణిలో పెండింగ్‌ ఉన్న అర్జీల వివరాలను సైతం సేకరించి ఆయా శాఖల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం జాబితాలో నమోదు చేశారు. వీటి పరిష్కారానికి భూసర్వే తప్పనిసరిగా చేయాలని కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. సాదాబైౖనామా కోసం చట్టానికి సవరణ చే యాలని సూచించినట్టు తెలిసింది. వివాదాల కేసులు కోర్టుల్లో ఉండగా వాటిని కూడా పరిష్కరించాలని సిఫారసు చేసినట్టు సమాచారం. ధరణి కమిటీ తన నివేదికను త్వరలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి అందజేయనున్నట్టు కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు.

Updated Date - Feb 09 , 2024 | 07:14 AM