Health News: కాలం చెల్లిన మందులను పారేయండి
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:54 AM
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాలం చెల్లిన ఔషధాలను తక్షణమే పారవేయాలని ప్రజారోగ్య సంచాలకుడు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) రవీంద్రనాయక్ ఆదేశాలు జారీ చేశారు.
అలాంటి ఔషధాలు ఉంటే చర్యలు తప్పవు
వైద్య అధికారులకు డీహెచ్ ఆదేశాలు
అవసరం లేని మందులు కొని.. తమదే బాధ్యతంటే ఎలా అంటున్న అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాలం చెల్లిన ఔషధాలను తక్షణమే పారవేయాలని ప్రజారోగ్య సంచాలకుడు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) రవీంద్రనాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులందరికీ సర్క్యులర్ జారీ చేశారు. కాలం చెల్లిన మందుల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే వాటిని పారవేయడం లేదని పేర్కొన్నారు. కాలం చెల్లిన ఔషధాలను తక్షణమే డిస్పోజ్ చేయాలనే నియమానికి ఎవ్వరూ కట్టుబడి ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో కాలం చెల్లిన ఔషధాలు ఉన్నట్లు గుర్తించినట్లయితే బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కాలం చెల్లిన ఔషధాలను రోగులకు వినియోగిస్తున్న ఘటన నిర్మల్ జిల్లాలో జరగ్గా.. ఆ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాలం చెల్లిన ఔషధాలపై వైద్యశాఖ దృష్టి సారించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు అవసరం లేని ఔషధాలను ఇష్టారాజ్యంగా భారీ మొత్తంలో కొనుగోలు చేసి, వాటిని ఆస్పత్రులకు పంపుతున్నారు.కొన్నిసార్లు ఇండెంట్ పెట్టకపోయినప్పటికీ టీజీఎంఎ్‌సడీసీ నుంచి బలవంతంగా ఒత్తిడి చేసి వాటిని పంపిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీహెచ్ ఇచ్చిన సర్క్యులర్‌పై పీహెచ్‌సీ వైద్య అధికారులు, ఫార్మసి్‌స్టలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దోళ్లు చేసే తప్పులకు తమను ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అవసరం లేని ఔషధాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటిని గడువు తీరకముందే వాడాలంటే ఎలా? అని నిలదీస్తున్నారు. పైగా అలాంటి కాలం చెల్లిన మాత్రలు ఆస్పత్రుల్లో ఉంటే సంబంధిత వైద్యులను ఎలా బాఽధ్యుల్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు.