Share News

కాలపరిమితి ముగిసిన ఔషధాల పంపిణీ

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:10 AM

నల్లగొండ జిల్లా చింతపల్లి పల్లె దవాఖానాకు వచ్చిన రోగులకు కాల పరిమితి ముగిసిన ఔషధాలను సూపర్‌వైజర్‌ అందజేశారు.

కాలపరిమితి ముగిసిన ఔషధాల పంపిణీ
చింతపల్లి పల్లె దవాఖానాకు వచ్చిన రోగులకు అందజేసిన కాలం చెల్లిన సిర్‌పలు, టాబ్లెట్లు

పల్లె దవాఖానాలో రోగులకు అందజేత

నల్లగొండ జిల్లా చింతపల్లిలో సంఘటన

చింతపల్లి, ఫిబ్రవరి 14: నల్లగొండ జిల్లా చింతపల్లి పల్లె దవాఖానాకు వచ్చిన రోగులకు కాల పరిమితి ముగిసిన ఔషధాలను సూపర్‌వైజర్‌ అందజేశారు. బుధవారం దవాఖానాకు వచ్చిన రోగుల తరఫు బంధువులు గుర్తించి ప్రశ్నించటంతో పొరపాటైందని ఆమె సమాధానమిచ్చారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా చింతపల్లి మండల కేంద్రంలో పల్లె దవాఖానాను ఏర్పాటు చేశారు. వైద్యాధికారి, స్టాఫ్‌ నర్సుతో పాటు మరో ఇద్దరు వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా వైద్యాధికారి పోస్టు భర్తీ చేయకపోవడంతో ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్‌తో పల్లె దవాఖానా నడుస్తోంది. ఈ పల్లె దవాఖానాకు ప్రతీ రోజు సుమారు 10నుంచి 30 మంది వరకు రోగులు వచ్చి వెళుతుంటారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఎన్‌ఎం జయ ఇటీవల కుర్మపల్లికి బదిలీకాగా, పీహెచ్‌సీలో పనిచేసే సూపర్‌వైజర్‌ విజయ, మూడో ఏఎన్‌ఎం అశ్విని విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కొంతమంది రోగులు పల్లె దవాఖానాకు రాగా వైద్యపరీక్షలు నిర్వహించిన సూపర్‌వైజర్‌ విజయ వారికి టాబ్లెట్లు, సిరప్‌ అందజేశారు. బుధవారం గ్రామానికి చెందిన శంషుద్దీన్‌ బంధువును పల్లె దవాఖానాకు తీసుకురాగా సిబ్బంది వారికి కాలపరిమితి దాటిన సిరప్‌, టాబ్లెట్లను ఇచ్చారు. జూలై 2023వ తేదీవరకే కాలపరిమితి ఉన్న సిరప్‌ ఇవ్వడం ఏమిటని శంషుద్దీన్‌ సూపర్‌వైజర్‌ విజయను ప్రశ్నించగా, తాను 10 రోజుల క్రితమే వచ్చానని, పొరపాటైందని పేర్కొన్నారు.

సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం: డాక్టర్‌ శ్రీదేవి, పీహెచ్‌సీ, చింతపల్లి

పల్లె దవాఖానాలో ఉన్న గడువు తీరిన ఔషధాలను పీహెచ్‌సీకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. పల్లె దవాఖానాలో మందులు అయిపోతే పీహెచ్‌సీ నుంచి తీసుకోవాలి. పల్లె దవాఖానాకు వచ్చిన రోగులకు కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్య సిబ్బందిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.

Updated Date - Feb 15 , 2024 | 12:10 AM