క్రీడల హబ్‌గా జిల్లా...
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:02 AM
జిల్లా క్రీడల హబ్‌గా ఎదిగింది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభను చాటారు.
- అభివృద్ధి పథంలో జిల్లా క్రీడారంగం
- జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణ
- పలు క్రీడాంశాల్లో చాంపియన్లుగా జిల్లా జట్లు
కరీంనగర్ స్పోర్ట్స్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా క్రీడల హబ్‌గా ఎదిగింది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభను చాటారు. జిల్లా కేంద్రంలో రెండు జాతీయస్థాయి కరాటే పోటీలను నిర్వహించారు. పలు రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా జట్లు విశేష ప్రతిభచాటి రాష్ట్ర చాంపియన్లుగా నిలిచారు. జిల్లాకు చెందిన కట్ట శ్రీవల్లి బీసీసీఐ నిర్వహించిన జాతీయస్థాయి వన్డే పోటీలకు జిల్లా నుంచి మొట్ట మొదటిసారిగా ఎంపికైన హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి పాల్గొంది. జాతీయ కరాటే పోటీలను నిర్వహించి జిల్లా జాతీయ క్రీడారంగంలో ఒక మైలురాయిగా నిలిచింది.
జాతీయస్థాయి క్రీడలకు వేదికగా...
ఈ సంవత్సరం జిల్లా కేంద్రంలో రెండు జాతీయస్థాయి కరాటే పోటీలను ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 4వ తేదీన జిల్లా కేంద్రంలోని రాజశ్రీ గార్డెన్స్‌లో గౌరు నారాయణరెడ్డి మెమోరియల్ జాతీయస్థాయి కరాటే పోటీలను నిర్వహించారు. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కాంటినెంటల్ షోటోకాన్ కరాటే డో ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో కృష్ణంరాజు మెమోరియల్ జాతీయస్థాయి కరాటే పోటీలను నవంబరు 22, 23, 24 తేదీల్లో నిర్వహించారు. సినీ నటుడు సుమన్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
- జూలై 7వ తేదీన తెలంగాణ రాష్ట్రస్థాయి చదరంగ పోటీలను అల్గునూరు చౌరస్తాలోని లక్ష్మీనరసింహ కన్వెన్షన్ హాల్‌లో జీనియస్ చదరంగ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సెప్టెంబరు 18న గంగాధర మండలం కురిక్యాలలో సబ్ జూనియర్ షూటింగ్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించారు. జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో హుజూరబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తేదీల్లో రాష్ట్రస్థాయి హాకీ పోటీలను నిర్వహించారు. డిసెంబరు 9, 10, 11 తేదీల్లో కరీంనగర్ సమీపంలోని కొత్తపెల్లిలో అల్ఫోర్స్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలను నిర్వహించారు.
రాష్ట్రస్థాయి చాంపియన్లుగా..
మే 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో జిల్లా జట్లు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సాధించాయి. నవంబరు 15, 16, 17 తేదీల్లో ఖమ్మంలో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్-14 అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా జట్లు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సాధించాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో నవంబరు 16, 17, 18 తేదీల్లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్-17 సెపక్ తక్రా పోటీల్లో జిల్లా బాలబాలికల జట్లు రాష్ట్ర చాంపియన్లుగా నిలిచాయి. నవంబర్ 8, 9, 10 తేదీల్లో జిల్లా విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ట్రాన్స్‌కో, డిస్కంలో ఇంటర్ సర్కిల్ టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ పోటీల్లో కరీంనగర్ సర్కిల్ క్రీడాకారులు చాంపియన్‌షిప్‌లను సాధించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో డిసెంబరు 23, 24, 25 తేదీల్లో నిర్వహించిన జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో జిల్లా బాలికల జట్టు తృతీయ స్థానం సాధించింది.
బీసీసీఐ సీనియర్ వన్డే పోటీలకు శ్రీవల్లి ఎంపిక
జిల్లాకు చెందిన కట్ట ఉమారాణి, లక్ష్మారెడ్డి కుమార్తె కట్ట శ్రీవల్లి ఉమ్మడి జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా బీసీసీఐ సీనియర్ మహిళలు క్రికెట్ వన్‌డే పోటీలకు ఎంపికైంది. ఆమె హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై ప్రతిభ చాటింది.
ఉత్సాహంగా కరీంనగర్ మారథాన్...
కరీంనగర్ రన్నర్స్, సైకిల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ పసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కరీంనగర్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఐదు ఈ మారథాన్‌లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు.
ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో...
పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సంవత్సరం 38 క్రీడాంశాల్లో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించారు. 24 జోనల్‌స్థాయి (ఉమ్మడి జిల్లా) పోటీలు నిర్వహించి ఈ పోటీల్లో ప్రతిభచాటిన క్రీడకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపించారు.
వివాదాస్పదంగా క్రీడా ప్రాంగణాల టెండర్ల ప్రక్రియ...
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని, స్కేటింగ్ రింగులను రెండు సంవత్సరాలకాలంపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు కలెక్టర్ టెండర్లను పిలిచారు. ఈ టెండర్ల ప్రక్రియ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. పలు క్రీడా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ టెండర్లప్రక్రియను వ్యతిరేకించాయి. చివరకు ఎవరూ టెండర్ వేయకపోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
ఘనంగా సీఎం కప్ పోటీలు...
జిల్లా యువజన క్రీడాశాఖల ఆధ్వర్యంలో జిల్లాలో ఈ సంవత్సరం సీఎం క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆరు క్రీడాంశాల్లో, మండల స్థాయిలో ఆరు క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించారు. మండలాల్లో ప్రతిభచాటిన క్రీడాకారులతో కూడిన జట్లు జిల్లాస్థాయిలో పాల్గొన్నాయి. జిల్లాస్థాయిలో దాదాపు 27 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించారు.
నియామకాలు
- స్విమ్మింగ్ కోచ్ వి శ్రీనివాస్‌గౌడ్ డీవైఎస్‌వోగా ఆగస్టు 22న పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు బి వేణుగోపాల్ పదవీ బాధ్యతలను స్వీకరించారు.
- ఒలంపిక్ సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడిగా సిలివేరి మహేందర్ ఎన్నికయ్యారు.