చెట్లపై గొడ్డలి వేటు
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:27 PM
అక్రమంగా నరికివేస్తున్న వైనం బొగ్గుల తయారీకి, ఇటుక బట్టీలకు, సామిల్లులకు తరలుతున్న కలప చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
అక్కన్నపేట, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పచ్చని చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారు. నరికి వేసిన చెట్లను అక్రమార్కులు ఇటుక బట్టీలకు, బొగ్గుల తయారీకి, సామిల్లులకు తరలిస్తున్నారు. పెద్ద పెద్ద వృక్షాలను నరికి తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, మద్దూర్, దూళిమిట్ట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో దర్జాగా చెట్లను నరికి అక్రమార్కులు లారీలు, డీసీఎం వ్యాన్లు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అటవీ, రెవెన్యూశాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో కలప వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. ఓవైపు ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి మొక్కలను నాటుతుంటే కాపాడాల్సిన అధికారులే మామూళ్లు తీసుకుంటూ అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా చెట్లను నరికి వేసి అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని, తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తూ సీజ్ చేసిన వాహనాలను వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చెట్లు నరికి తరలించాలంటే అటవీశాఖ అనుమతులతోపాటు, తహసీల్దార్ కార్యాలయంలో చలాన్ కట్టి, గ్రామ పంచాయతీల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కలప వ్యాపారులు చెట్లను నరికి వేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. రైతులు కూడా తమ పొలాల్లోని చెట్లను నరకాలంటే తహసీల్దార్ కార్యాలయంలో చలన్ కట్టడంతో పాటు నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వ్యాపారులు చెట్లను నరికించి ఇటుక బట్టీలకు, బొగ్గుల తయారీకి, సామిళ్ల మిల్లులకు అక్రమంగా వాహనాల్లో తరలించడం నిరంతరం జరుగుతూనే ఉంది. సంబంధిత శాఖల అధికారులు స్పందించి చెట్లను నరకకుండా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీ్‌పకుమార్‌ను వివరణ కోరేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
చర్యలు తీసుకోవాలి
చెట్లను అనుమతులు లేకుండా నరికి వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నరికి వేసిన కలపను ఇటుక బట్టీలకు, బొగ్గుల తయారీకి, సామిల్లులకు అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
జనగామ వేణుగోపాల్‌రావు, బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్, అక్కన్నపేట