Share News

KTR: మా నినాదం గుర్తుందా.. ఎక్స్‏లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్

ABN , Publish Date - Oct 21 , 2024 | 09:02 AM

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన నినాదం గుర్తుందా అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రాదని తామన్నామని, ఇప్పుడు అదే అక్షర సత్యం అయిందని విమర్శించారు.

KTR: మా నినాదం గుర్తుందా.. ఎక్స్‏లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన నినాదం గుర్తుందా అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రాదని తామన్నామని, ఇప్పుడు అదే అక్షర సత్యం అయిందని విమర్శించారు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నవారు, రూ.10 వేలకే ఎగనామం పెట్టారని పేర్కొన్నారు. "రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..? ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..? రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది! నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..! ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..! పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే..అన్నదాత వెన్ను విరవడమే..! రైతు ద్రోహి కాంగ్రెస్..చరిత్ర నిండా అనేక రుజువులు..ఇప్పుడు ఇంకొకటి ! రైతు ద్రోహి సీఎం రేవంత్ రెడ్డిని వదిలేదే లేదు" అని కేటీఆర్ తన ఎక్స్ పోస్ట్ లో విమర్శలు గుప్పించారు.


కమిటీల పేరుతో కాలయాపనే..

రైతు భరోసా నిబంధనలంటూ కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. ఆదివారం వివిధ జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపాయి. ఈ మేరకు ఆ పార్టీ ఇవాళ ఎక్స్ లో చేసిన ఓ పోస్ట్ ను కేటీఆర్ రీపోస్ట్ చేశారు. "రైతులకు మద్దతుగా జిల్లా, మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. రైతులకు ద్రోహం చేసిన రేవంత్‌, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి.. వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రేవంత్‌ సర్కారు హామీలను అమలు చేయకుండా అన్నదాతలను నయవంచనకు గురిచేసింది.


ఇప్పటికే రుణమాఫీ విషయంలో కర్షకులను వంచించిన కాంగ్రెస్‌ సర్కారు ఇప్పుడు రైతు భరోసా విషయంలోనూ మరోసారి మోసం చేసింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి మోసాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందే. గడచిన వానకాలం రైతుభరోసా ఇవ్వబోమంటే ఊరుకోం. సబ్‌ కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి సాయం అందిస్తామంటే సహించబోం" అని బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

Police Commemoration Day 2024: సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి

For Latest News and National News click here

Updated Date - Oct 21 , 2024 | 09:20 AM