ఇంకుడు గుంతలపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Mar 14 , 2024 | 05:35 AM
వాన నీటి సంరక్షక వ్యవస్థల (ఆర్‌డబ్ల్యూహెచ్‌ఎ్‌స) పట్ల నిర్లక్ష్యం వహిస్తే బెంగళూరులో నెలకొన్నటువంటి తాగునీటి ఎద్దడి పరిస్థితులు హైదరాబాద్‌లోనూ నెలకొనే ప్రమాదం ఉందని హైకోర్టు హెచ్చరించింది.
సరిగా స్పందించకుంటే బెంగళూరు పరిస్థితి వస్తుంది
వేసవిలో తాగునీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకోండి
ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలను గుర్తించండి
పట్టణాలు, గ్రామాల్లో సైతం ఆర్‌డబ్ల్యూహెచ్‌ఎస్ ఉండాలి
తెలంగాణ జల, భూ, వృక్ష చట్టాన్ని అమలు చేయాలి
ప్రభుత్వ శాఖలకు హైకోర్టు మార్గదర్శకాలు
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): వాన నీటి సంరక్షక వ్యవస్థల (ఆర్‌డబ్ల్యూహెచ్‌ఎ్‌స) పట్ల నిర్లక్ష్యం వహిస్తే బెంగళూరులో నెలకొన్నటువంటి తాగునీటి ఎద్దడి పరిస్థితులు హైదరాబాద్‌లోనూ నెలకొనే ప్రమాదం ఉందని హైకోర్టు హెచ్చరించింది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలను గుర్తించాలని, తెలంగాణ జల, భూ, వృక్ష చట్టం అమలు చేయాలని, అర్బన్ లోకల్ బాడీలు, గ్రామాల్లో సైతం వాననీటి సంరక్షణ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2005 నాటి ఒక కేసుపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని.. తాగునీటి వినియోగాన్ని నియంత్రించేలా, నీటి సంరక్షణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ జర్నలిస్టు పీఆర్ సుభాష్ చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. సదరు లేఖను సుమోటోగా స్వీకరించిన అప్పటి హైకోర్టు.. తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి పలు కీలక సూచనలతో కూడిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. కాగా ఈ పిటిషన్ బుధవారం మరోసారి చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వీ సిద్ధివర్ధన వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్‌కు కాలం చెల్లిపోయిందని.. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు)గా ఉన్న సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి.. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, నిపుణుల కమిటీ సూచనలు, చట్టాల అమలు గురించి ధర్మాసనానికి వివరించారు. పిటిషన్‌కు కాలం చెల్లిపోయిందన్న ప్రభుత్వ వాదనను ఆమోదించలేమని పేర్కొన్న ధర్మాసనం.. నిర్లక్ష్యం వహిస్తే హైదరాబాద్‌లోనూ బెంగళూరు తరహాలో తాగునీటి కటకట ఏర్పడుతుందని హెచ్చరించింది. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటూ.. వివిధ ప్రభుత్వ శాఖలకు హైకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇవీ మార్గదర్శకాలు..
హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ శాఖ ముఖ్యకార్యదర్శి ఏకకాల చర్యగా నిబంధనల ప్రకారం ఆర్‌డబ్ల్యూహెచ్‌ఎ్‌స వ్యవస్థ లేని నిర్మాణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. అర్బన్ లోకల్ బాడీ్‌సలో ఆర్‌డబ్ల్యూహెచ్‌ఎ్‌స వ్యవస్థ నిబంధనలు అమలయ్యేలా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవల్‌పమెంట్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాచరణ చేపట్టాలి. గతేడాది మార్చి 31న జారీ చేసిన జీవో నెంబర్ 49 అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి అదనంగా చిన్న నిర్మాణాల్లో సైతం వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసే వ్యవహారాన్ని ప్రభుత్వం అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి. తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్-2002 చట్టంలోని నిబంధనల అమలుకు సెక్షన్ 11 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాలి. తాగునీటి వనరుల పరిరక్షణ, పంపిణీ, పునర్‌వినియోగం వంటి అంశాలను 3 నుంచి 5వ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చే అంశాన్ని పరిశీలించడంతోపాటు ఆరో తరగతి విద్యార్థులకు ఇవే అంశాలపై పెద్దస్థాయి సిలబస్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. అమికస్ క్యూరీ తన నివేదికలో పేర్కొన్న విధంగా వాచ్‌డాగ్ కమిటీని ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరాలు అందజేయాలి. రాష్ట్రంలో నీటి మోతాదులను సమీక్షించి.. తాగునీటి వినియోగం, గార్డెనింగ్ వంటి పనులకు నీటి వినియోగంపై అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలి. తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.