Share News

హెల్త్‌ వర్సిటీ వీసీగా డాక్టర్‌ రమేశ్‌రెడ్డి?

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:27 AM

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్‌ కోటా రమేశ్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

హెల్త్‌ వర్సిటీ వీసీగా డాక్టర్‌ రమేశ్‌రెడ్డి?

షార్ట్‌లిస్టులో ఆయన పేరు.. సీఎం వద్ద ఫైలు

బీఆర్‌ఎస్‌ హయంలో ఏడేళ్లు డీఎంఈగా అనుభవం

వర్సిటీకి పదేళ్లుగా ఒకే వీసీ.. కరుణాకర్‌రెడ్డిని కొనసాగించడంపై హైకోర్టులో వైద్యుల సంఘాల పిల్‌

నిబంధనల మేరకు వీసీ పదవీకాలం మూడేళ్లే

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్‌ కోటా రమేశ్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షార్ట్‌లిస్టులో ఆయన పేరు టాప్‌ త్రీలో ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వీసీ నియామక ఫైల్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చేరినట్లు సమాచారం. సీఎం నిర్ణయం తర్వాత అది రాజ్‌భవన్‌కు వెళ్లి అక్కడ ఆమోదముద్ర పొందిన అనంతరం జీవో వెలువడుతుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కాగా, రమేశ్‌రెడ్డి పేరు షార్ట్‌లిస్టులో చేరడానికి బలమైన లాబీయింగ్‌తో పాటు వైద్యవిద్యలో ఆయనకున్న అనుభవం కూడా తోడైంది. గత ప్రభుత్వ హయంలో ఏడేళ్ల పాటు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిజేశారు. అలాగే రెండేళ్లకు పైగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఇంచార్జి కమిషనర్‌గా, గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా, జాతీయ వైద్య కమిషన్‌ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర వైద్యమండలి వైస్‌ ఛైర్మన్‌గా పనిజేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంతోపాటు ఒకరిద్దరు మంత్రులు కూడా రమేశ్‌రెడ్డి తరఫున లాబీయింగ్‌ చేసినట్లు తెలుస్తోంది.

పదేళ్లు ఒక్కరే వీసీ!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హెల్త్‌ వర్సిటీ 2014లో ఏర్పాటైంది. తొలి వీసీగా డాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డిని 2015లో నాటి బీఆర్‌ఎస్‌ సర్కారు నియమించింది. అప్పటి నుంచి నేటి వరకు ఆయనే వీసీగా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం వీసీ పదవీ కాలం మూడేళ్లే. అయితే గత ప్రభుత్వం కరుణాకర్‌ రెడ్డికి వరుసగా ఎక్స్‌టెన్షన్‌ ఇస్తూ వచ్చింది. సుదీర్ఘకాలం ఆయ నే వీసీగా కొనసాగడంపై కొన్ని డాక్టర్ల సంఘాలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజం (పిల్‌) దాఖలు చేశాయి. దానిపై విచారణ కొనసాగుతుండగానే.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌ 7న హెల్త్‌ యూనివర్సిటీ కొత్త వీసీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తంగా 40 వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వడపోసి షార్ట్‌లిస్టును సిద్ధం చేశారు.

Updated Date - Nov 20 , 2024 | 04:27 AM