ఎండిన భీమా నది
ABN , Publish Date - Feb 23 , 2024 | 11:05 PM
వేసవి ఆరంభంలోనే మండలంలో భీమా నది అడుగంటుతోంది. దాంతో ఆయకట్టుకు సాగునీరందించే పరిస్థితి కనిపించడం లేదు.

- సాగునీటికి తీవ్ర ఇబ్బందులు
- ఎండుతున్న పంటలు
- ఆందోళనలో మండల రైతున్నలు
కృష్ణ, ఫిబ్రవరి 23: వేసవి ఆరంభంలోనే మండలంలో భీమా నది అడుగంటుతోంది. దాంతో ఆయకట్టుకు సాగునీరందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు అయోమయానికి గురవుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేయగా ప్రస్తుతం నీరందక ఎండిపోతున్నాయని మండల పరిధిలోని సుకూరులింగపాలి, తంగడిగి, కుసుమర్తి గ్రామాల రైతులు వాపోతున్నారు. నదిలో నీరులేక గుంతలో నిలిచిన నీటిలో ఉన్న చేపలు మృత్యువాత పడుతున్నాయి. పాడి రైతులు సైతం పశువుల తాగునీరు కోసం అల్లాడుతున్నాయి. గుంతలో నిలిచిన నీటిని తాపుదామంటే చేపలు మృతి చెంది కంపు వాసన వస్తోందని పశువులు తాగడం లేదంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలు చిన్న, సన్నకారు రైతులు పంటలకు సాగునీరు అందించేందుకు గుంతలు ఉన్న చోట నుంచి మోటార్లు ఏర్పాటు చేసుకొని పైపులు ద్వారా మడులకు పారిస్తున్నారు. ఇప్పటికే వరి మడులు నెర్రెలువిడిచాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటలకు కర్ణాటక రాష్ట్ర గూడూరు రోడ్డు కం బ్యారేజ్ ద్వారా దిగువ ఉన్న భీమా నదికి నీరు వదిలితే తప్ప తమ పంటలు చేతికి అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమానదిలో బండరాళ్లు తెలి ఏడారిని తలపిస్తోంది. దిగువకు నీరు విడుదల చేయాలని కర్ణాటక రాష్ట్రం యాదగిరి కలెక్టర్ వినతి పత్రం అందించినట్లు తెలిపారు. కొన్ని చోట్లు వరి పంటలు పొట్ట దశ ఉన్నాయని, ఈ సమయంలో నీరు అధికం కావాల్సి ఉంటుందని, సాగు చేసిన పంటలు ఎండిపోతే పెట్టిన ఖర్చులు సైతం చేతికి అందక నష్టపోతా మని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, ఉన్నతాధి కారులు కర్ణాటక ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి దిగువ ఉన్న భీమానదికి నీరు వచ్చే విధంగా చూ డాలని రైతులు కోరుతున్నారు.