Share News

‘ఫణిగిరి’ క్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:25 AM

ఫణిగిరి బౌద్ధక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి చేస్తామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గట్టుపై క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధక్షేత్రాన్ని సోమవారం ఆమె సందర్శించారు.

‘ఫణిగిరి’ క్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి
ఫణిగిరిలోని మ్యూజియంలోని వస్తువులను పరిశీలిస్తున్న భారతిహోళికేరి

నాగారం, జనవరి 16: ఫణిగిరి బౌద్ధక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి చేస్తామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గట్టుపై క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధక్షేత్రాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఫణిగిరిలో లభించిన 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం కాలం నాటి బౌద్ధక్షేత్ర ఆధారాలైన బౌద్ధారామం, చైత్యాలు, శిల్పసంపదను ఫణిగిరి మ్యూజియంలో భద్రపరిచిన వాటిని పరిశీలించారు. ఫణిగిరి గట్టుపైన కట్టడాలను, పురావస్తు శాఖ తవ్వకాల వివరాలను తెలుసుకున్నారు. శిల్పసంపదను గుర్తించేందుకు మరోసారి తవ్వకాలు జరిపేందుకు సిబ్బందితో కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలోని కేంద్ర పురావస్తు శాఖ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతామని, అనుమతి రాగానే తవ్వకాలు ప్రారంభిస్తామన్నారు. ఫణిగిరిలో తాత్కాలికంగా నిర్మించిన మ్యూజియంలో ఏర్పాటు చేసిన బౌద్ధ శిల్పాలను భద్రపర్చేందుకు, విశాలమైన మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. అంతర్జాతీయ బౌద్ధ బిక్షువులు ఫణిగిరి క్షేత్రాన్ని సందర్శించేందుకు మెరుగైన వసతులు కల్పించేలా గృహాలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆమె వెంట పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్లు రాములునాయక్‌, నాగరాజు, అసిస్టెంట్‌ డైరక్టర్లు మల్లునాయక్‌, సాగర్‌, బోధిసత్వం ఫౌండేషన అధ్యక్షుడు పులిగిళ్ల వీరమల్లుయాదవ్‌, జంపాల రాజేష్‌, నరహరి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఫణిగిరి గట్టును అభివృద్ధి చేయడంతో పాటు తవ్వకాలు చేపట్టాలని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పురావస్తు శాఖ డైరెక్టర్‌ భారతిహోళికేరిని కలిసి బోధిసత్వ ఫౌండేషన అధ్యక్షుడు వీరమల్లుయాదవ్‌ ఈ నెల 11వ తేదీన వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jan 17 , 2024 | 12:25 AM