Share News

నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం.. ఉపాధ్యాయులకు నోటీసులు

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:10 PM

నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం సాధించి సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులకు మంగళవారం నారాయణపేట ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ఘని నోటీసులు జారీ చేశారు.

నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం.. ఉపాధ్యాయులకు నోటీసులు
కులకచర్ల ఎంఈవో కార్యాలయంలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న అబ్దుల్‌ఘని

కులకచర్ల, మార్చి 12: నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం సాధించి సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులకు మంగళవారం నారాయణపేట ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ఘని నోటీసులు జారీ చేశారు. 2015లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నకిలీ ధ్రువపత్రాలతో కొందరు ఉపాధ్యాయులు ఉద్యోగాలు సాధించారని అప్పట్లో గండీడ్‌ మండలం మహ్మదాబాద్‌ గ్రామానికి చెందిన దొడ్డికాడి గోపాల్‌ గండీడ్‌ ఎంఈవో వెంకటయ్యకు, రంగారెడ్డిజిల్లా డీఈవోకు ఫిర్యాదు చేశారు. 2016లో విచారణ జరిపిన అప్పటి డీఈవో సత్యనారాయణరెడ్డి అంతారంలో ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న కొండారెడ్డి, చెరువుముందరి తండా(కే) ప్రాథమికపాఠశాలలో పని చేస్తున్న రాంచందర్‌, దోమ మండలం ఐనాపూర్‌ జడ్పీహెచ్‌ఎ్‌సలో పని చేస్తున్న ఎల్లారెడ్డిలను విధుల నుంచి తొలగించారు. సంబంధిత ఉపాధ్యాయులు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్‌ చేయకుండా ఎలా విధుల నుంచి తొలగిస్తారని, ముందుగా సస్పెన్షన్‌ చేసి పూర్తి స్థాయితో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో ఉన్నతాధికారులు వికారాబాద్‌ డీఈవోకు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సూచించారు. డీఈవో రేణుకాదేవి ఆదేశాలతో నారాయణపేట్‌ ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ ఘని కులకచర్ల ఎంఈవో కార్యాలయంలో సంబంధిత ముగ్గురు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని సూచించారు. తమకు పది రోజుల గడువు ఇవ్వాలని సంబంధిత ఉపాధ్యాయులు రాతపూర్వకంగా డీఈవోకు విజ్ఞప్తి చేశారని, ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.

Updated Date - Mar 12 , 2024 | 11:10 PM