Share News

డిగ్రీ కాలేజీల బంద్‌ విరమణ

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:48 AM

ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌ బిల్లుల పెండింగ్‌ను నిరసిస్తూ మంగళవారం నుంచి కళాశాలల బంద్‌ను పాటించాలని తీసుకున్న నిర్ణయాన్ని డిగ్రీ కాలేజీల

డిగ్రీ కాలేజీల బంద్‌ విరమణ

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌ బిల్లుల పెండింగ్‌ను నిరసిస్తూ మంగళవారం నుంచి కళాశాలల బంద్‌ను పాటించాలని తీసుకున్న నిర్ణయాన్ని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. దాంతో రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఫీజుల పెండింగ్‌ అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి సమక్షంలో మంగళవారం చర్చలు జరిగాయి. ప్రభుత్వ పెద్దలతో చర్చించి సమస్య పరిష్కారానికి త్వరలోనే ఓ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తానని చైర్మన్‌ కళాశాల యాజమాన్యాలకు హామీ ఇవ్వడంతో బంద్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం వద్దు

పాఠశాల నిర్వహణ సమయాల్లో తరగతి గదులు, పాఠశాల పరిసరాల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని స్పష్టం చేస్తూ విద్యాశాఖ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. మెదక్‌ - నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంతో పాటు, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది.

జేఈఈ మెయిన్‌ దరఖాస్తులకు ‘ఎడిట్‌’ ఆప్షన్‌

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎన్‌టీఏ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) అభ్యర్థులకు మరో అవకాశమిచ్చింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఈ నెల 26, 27 తేదీల్లో ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.

Updated Date - Nov 20 , 2024 | 04:48 AM