Share News

పది లక్షలకు మించి..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:47 AM

తుక్కుగూడలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జన జాతర సభకు పది లక్షలకు మించి జన సమీకరణ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుని జనాన్ని సమీకరించే బాధ్యతను అభ్యర్థులు స్వీకరించాలని చెప్పారు.

పది లక్షలకు మించి..!

జన జాతర సభకు భారీగా ప్రజలను తరలించాలి

పాంచ్‌ న్యాయ్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి.. అధిక సీట్లు ఖాయం

అప్పుడు రాహుల్‌ ప్రధానమంత్రి అవుతారు

ఇన్‌చార్జులు, అభ్యర్థులతో సమీక్షలో సీఎం రేవంత్‌

తుక్కుగూడలో జన జాతర సభ ఏర్పాట్ల పరిశీలన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తుక్కుగూడలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జన జాతర సభకు పది లక్షలకు మించి జన సమీకరణ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుని జనాన్ని సమీకరించే బాధ్యతను అభ్యర్థులు స్వీకరించాలని చెప్పారు. తుక్కుగూడలో జన జాతర బహిరంగ సభ నిర్వహించనున్న రాజీవ్‌ గాంధీ సభా ప్రాంగణాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం 14 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, 12 మంది అభ్యర్థులతో సుమారు రెండు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరచనున్న ఐదు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. ‘‘ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి. అభ్యర్థులు ప్రజలతో మమేకం కావాలి. నాయకులు, కార్యకర్తలతో కలిసిపోవాలి. అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పట్టుదలతో పని చేయాలి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ గాలి లేదు. అక్కడ ఇండియా కూటమికి అధిక స్థానాలు వచ్చే అవకాశాలున్నాయు. తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది. అత్యధిక ఎంపీ స్థానాలను దక్కించుకుంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయం’’ అని దిశానిర్దేశం చేశారు. పార్టీ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్‌, ప్రియాంక గాంధీ ఉపన్యాసాలపై గ్రామాల్లో చర్చించేలా చేయాలని, తద్వారా, పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పే విధంగా జన సమీకరణ జరగాలన్నారు. ‘‘రాజధాని పరిసరాల్లోని ఏడు లోకసభ నియోజక వర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ జరగాలి. ఒక్కో సెగ్మెంట్‌ నుంచి కనీసం 50 వేల మంది చొప్పున, ఇతర ప్రాంతాల్లో శాసనసభ నియోజకవర్గం నుంచి ఐదు వేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలి. రాష్ట్రంలోని సుమారు 30 వేల పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని సమన్వయకర్తలు ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో కనీసం పది మందికి తగ్గకుండా తీసుకురావాలి’’ అని కోరారు. సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండ సురేఖ, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం మీడియా సమావేశం ఉందని సమాచారం ఇచ్చారు. మీడియా ప్రతినిధులు మూడు గంటలపాటు ఎదురు చూశారు. చివరకు ప్రెస్‌ మీట్‌ నిర్వహించకుండానే సీఎం వెళ్లిపోయరు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీధర్‌బాబు ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలను అందించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. తుక్కుగూడలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విడుదల చేసిన ఆరు గ్యారంటీలకు ఎంతో ఆదరణ లభించిందని, ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, అదే సెంటిమెంటుతో పాంచ్‌ న్యాయ్‌కు శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు. తాట తీస్తామంటూ కేటీఆర్‌ చేసిన హెచ్చరికలపై మండిపడ్డారు. ఎన్నికలు ముగిశాక ఎవరు తాటతీస్తారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై చట్టపరంగా, న్యాయపరంగా ఎలా వ్యవహరించాలో తమకు తెలుసన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 05:47 AM